ఈతరం భారతం సాహిత్యాంశం:
కుమారుడు
రాయగడ్ కోటలో 1674 జూన్ 6న ఘనమైన వేడుకలో మరాఠా సామ్రాజ్యానికి చక్రవర్తిగా శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగింది. ఆ వేడుకలో తల్లి జీజాబాయి ఆనందభాష్పాలతో కుమారుడిని కౌగిలించుకొని ఆశీర్వదించింది. కానీ దురదృష్టవశాత్తూ అదే నెల 17న జీజాబాయి పరమపదించింది. తల్లి మరణంతో శివాజీ తీవ్రంగా కలత చెందాడు. ఆ సమయంలో కుమారులు రాజారాం, సంభాజీ మధ్య ప్రారంభమైన సింహాసన పోటీ ఆయన మనసును మరింత కలిచివేసింది.
వేలూరు, చెంజి కోటలను జయించిన శివాజీ 1677లో మద్రాస్ (చెన్నై) వైపు పయనమయ్యాడు. బ్రిటిష్ అధికారు భయంతో వణికిపోయారు. కానీ కొన్ని రాజకీయ కారణాల వల్ల దాడిని కొనసాగించకుండా శివాజీ రాయగడ్ తిరిగి వెళ్లాలని నిర్ణయించాడు. బయలుదేరేముందు కాళికాంబాళిని దర్శించాలనే ఆజ్ఞను తన పేష్వాకు ఇచ్చాడు.
1677 అక్టోబర్ 3న కాళికాంబాళి ఆలయం పరిసరాలు ఉత్సాహంగా మారాయి. శివాజీని చూడటానికి జన సమూహం సముద్రంలా పోటెత్తింది. శివాజీ సైనికులు “రస్త్యాత్ ఉభే రహూ!” (మార్గంలో నిలబడవద్దు) అని మరాఠీ భాషలో గట్టిగా అరిచి శివాజీ గుర్రానికి ఆలయానికి చేరుకునే దారి సుగమం చేశారు. దర్శనం ముగిసిన తరువాత శివాజీ బయలుదేరిపోయాడు. అయితే కొద్ది సేపట్లోనే “శివాజీ సైనికులు రాణీబాయి అనే యువతిని అపహరించారట” అనే వార్త పట్టణమంతా వ్యాపించింది.
రాయగడ్ కోటలో రాణీబాయి ఒక గదిలో ఉంచబడింది. ఆమే నిత్యం ఏడుస్తూనే ఉండేది. ప్రతి ఉదయం శివాజీ తన కార్యాలయానికి వెళ్లేముందు రాణీబాయి గదికి వచ్చి “ఆయీ నమస్కార్” (అమ్మా నమస్కారం) అని చేతులు జోడించి నమస్కరించేవాడు. ఒక నెల గడిచినా రాణీబాయి ఆహారం తినడానికి నిరాకరించింది.
ఒక రోజు ఒక దుభాషి ఆమె గదికి వచ్చి తమిళంలో చెప్పింది: “రాజమాతా రూపంలో మీరు ఉన్నందున పొరపాటున ఇక్కడకు తీసుకొచ్చారు. చత్రపతి గారు మిమ్మల్ని తల్లిలా గౌరవిస్తున్నారు.” రాణీబాయి కన్నీళ్లతో చెప్పింది: “కాళికాంబాళి ఆలయానికి వచ్చిన మీ మహారాజును చూడటమే నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు. మా ఇంట్లో వృద్ధ తల్లిదండ్రులు, భర్త, మూడు సంవత్సరాల కుమారుడు నన్ను చూడక ఎలా తల్లడిల్లుతారో! ఇవన్నీ మీ రాజుకు ఎలా తెలుస్తాయి?” అని వాపోయింది.
రెండు రోజుల తర్వాత దుభాషి మళ్లీ వచ్చింది. “మీ పరిస్థితిని మన్నరికి వివరించాను. అష్టప్రధాన మండలితో చర్చించి మిమ్మల్ని తిరిగి మద్రాస్ పట్టణానికి పంపించేందుకు ఆయన నిర్ణయించారు. రేపు పౌర్ణమి రాత్రి మీరు బయలుదేరుతారు. దయచేసి ఆహారం తినండి, సంతోషంగా ఉండండి” అని చెప్పింది.
పౌర్ణమి రాత్రి — ఆకాశం వెండి వెలుగుతో మెరుస్తోంది. సంభాజీ నాయకత్వంలో గుర్రపు దళం సిద్ధంగా ఉంది. రాణీబాయి ముందుకు తీసుకువచ్చారు. చత్రపతి శివాజీ స్వయంగా బంగారం, వెండి నాణేల సంచులు బహుమతిగా ఇచ్చి “ఆయీ నమస్కార్” అని నమస్కరించాడు. రాణీబాయి కళ్లలో కన్నీళ్లు కదిలాయి. (మగన్ — కుమారుడు) అని మరాఠీలో ఎలా అంటారో ముందే దుభాషి దగ్గర తెలుసుకుని, శివాజీ దగ్గరకు వెళ్లి కౌగిలించుకొని “ముల్కా” అని మూడుసార్లు పిలిచింది.
ఆ స్వరం విని శివాజీకి తల్లి జీజాబాయి పిలుస్తున్నట్టనిపించింది. ఒక్కసారిగా ఆయన గుండె తడిసి ముద్దయింది. కళ్లలో జలదారలు తడిసినా ఎవరికీ తెలియనివ్వకుండా చేతులతో తుడిచుకున్నాడు. రాణీబాయి ఎక్కాల్సిన తెల్ల గుర్రం ముందుకు వచ్చింది. శివాజీ స్వయంగా ఆమెకు చేయూతనిస్తూ మెల్లగా గుర్రంపై కూర్చోబెట్టాడు. గుర్రాల అడుగుల శబ్దం నిశ్శబ్దమయ్యే వరకు అక్కడే నిలబడి, తరువాత మెల్లగా కోట వైపు భారమైన హృదయంతో నడిచాడు.
(చెన్నై పారిమునైలోని తంబుచెట్టి వీధిలో ఉన్న కాళికాంబాళి ఆలయంలో 1677 అక్టోబర్ 3న చత్రపతి శివాజీ దేవిని దర్శించారన్న శాసనం నేటికీ ఉంది. దానిని ఆధారంగా తీసుకుని రచించబడిన కల్పిత కథ — కుమారుడు“ముల్కా”
తమిళమూలం – ముత్తుకుమారన్
తెలుగు అనువాదo – డా పెరుక రాజు















