బహు భాషా కోవిదులు డా. నలిమెల భాస్కర్ కి కాళోజీ పురస్కారం
నిరంతర పరిశోధనాత్మక దృక్పథంతో క్రియాశీలకంగా సాగుతూ అత్యద్భుత సాహిత్యావిష్కరణలకు కేంద్రంగా నిలిచిన ప్రఖ్యాత సాహితీవేత్త డాక్టర్ నలిమెల భాస్కర్. 2024 సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వ కాళోజీ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. కవిగా, రచయితగా, పరిశోధకునిగా, అనువాదకునిగా, విశ్రాంత తెలుగు అధ్యాపకునిగా, బహుభాషా కోవిదునిగా ఆయన ప్రస్థానం నాలుగు దశాబ్దాలుగా అప్రతిహతంగా సాగుతున్నది. 14 భాషలలో నిరంతర కృషితో ఆయన తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. పీవీ నరసింహారావు తర్వాత అన్ని భాషలను తెలిసిన పండితునిగా కూడా పేరు పొందారు. అనువాదకుడిగా ఆయన చూపిన ప్రజ్ఞ భాషలకు భావాలు చెప్పిన భాస్కరునిగా ఆయనకు విస్తృతమైన గుర్తింపును తీసుకువచ్చింది.
2 ఫిబ్రవరి 1956 లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ లో బుచ్చమ్మ రామచంద్రం దంపతులకు భాస్కర్ జన్మించారు. ఎం ఏ, బిఈడి, ఎంఫిల్, పీహెచ్ డి విద్యార్హతలను పొందారు. తెలుగు అధ్యాపకులుగా పనిచేసి ఎందరో విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్ది ఉద్యోగ విరమణ చేశారు. సాహిత్యం పై ముఖ్యంగా పరిశోధన, అనువాదం పై ఉన్న మక్కువతో నిరంతర అధ్యయనం చేసి ఎన్నో అమూల్యమైన రచనలను సాహిత్య లోకానికి భాస్కర్ అందించారు.భాస్కర్ రచించిన పలు గ్రంథాలు ఆయనకు ఎంతో పేరు ప్రఖ్యాతులను తీసుకువచ్చాయి. 1974లో మానవుడా, 1977లో కిరణాలు, 1978లో ఈతరం పాటలు, 1993లో నూరేళ్ల 10 ఉత్తమ మలయాళం కథలు, 1996లో అద్దంలో గాంధారి, 2000లో సాహితీ సుమాలు, 2000లో తమిళ్ తోటత్తిల్ తెలుంగు కుయిల్ గళ్ , 2003లో తెలంగాణ పదకోశం, 2005లో మంద మరి పద మూడు కథలు, 2006లో మట్టి ముత్యాలు, 2008లో బాణం, 2010లో భారతీయ కథలు, దేశ దేశాల కవిత్వం, స్మారక శిలలు, 2016లో నాని కవిదైగళ్, 2017లో తెలంగాణ భాష దేశ్య పదాలు గ్రంథాలు వెలువడ్డాయి. పలు జాతీయ, రాష్ట్ర పురస్కారాలను భాస్కర్ అందుకున్నారు. పునరిత్ కుంజబ్దుల్లా రాసిన మలయాళం నవల స్మారక శశిగల్ ను తెలుగులోకి స్మారక శిలలుగా అనువదించినందుకు 2013లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. 2014లో అనువాద సాహిత్య కృషికి గాను డాక్టర్ బోయి భీమన్న పురస్కారాన్ని పొందారు. 2016లో డాక్టర్ సినారె పురస్కారం, 2015లో గురజాడ పురస్కారం, కాళోజీ పురస్కారం, 2010లో ఇండియన్ హైకూ క్లబ్ పురస్కారం, 1997లో తెలుగు విశ్వవిద్యాలయ అనువాద పురస్కారం, 1998లో కళాసాగర్ పురస్కారం, 2001లో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, 2003లో ఆత్మీయ మిత్రుల పురస్కారం, 2001లో బిఎన్ శాస్త్రి పురస్కారం, డాక్టర్ ద్వానా శాస్త్రి పురస్కారం పొందారు. ఎన్నో పుస్తకాలకు సంపాదకత్వం కూడా వహించారు. 2013లో నలిమెల భాస్కర్ సాహిత్యం పై విశ్లేషణతో నవనీతం అన్న గ్రంథాన్ని కరీంనగర్ సాహితీ సోపతి ప్రచురించింది. తెలంగాణ పదకోశం, తెలంగాణ భాష దేశ్య పదాలు
అన్న గ్రంథాలు ఆయన సునిశితమైన పరిశోధనాత్మక కృషికి ప్రతిబింబాలుగా నిలిచాయి. పల్లీయుల నాలుకలపై నర్తించే కమ్మని అమ్మనుడుల అర్థ వివరణలతో ఆయన గ్రంథం తెలంగాణ భాష దేశ్య పదాలు చదువరులు, పరిశోధకులను ఎందరినో ఆకట్టుకుంది. తెలుగు భాష స్వరూప స్వభావాన్ని వెల్లడించే పదాలెన్నో తెలంగాణ గ్రామీణ ప్రాంత భాషా వ్యవహారంలో అత్యంత సహజంగా అల్లుకుపోయాయన్న విషయాన్ని సుస్పష్టమైన ఉదాహరణలతో ఆయన తన రచనల ద్వారా వెల్లడించారు. తెలంగాణ దేశ్య పద సౌరభాన్ని పరిమళింపజేసిన ఆయన నిత్య పరిశోధక మూర్తి, సాహిత్య సృజన దీప్తి.
( డా. నలిమెల భాస్కర్ కాళోజీ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా….)
డా. తిరునగరి శ్రీనివాస్
9441464764
















