EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మనసు ‘అద్దం’లోని భావోద్వేగం…

ఈతరం భారతం సాహిత్యాంశం :

మనసు ‘అద్దం’లోని భావోద్వేగం…

—————————————-

‘బతకాలనే తెలివి తప్ప / మోసం చేయాలనే కుట్రలే తెల్వనోళ్ళం ‘ అని సగటు మనిషిలోని జీవన స్పష్టతను కవితాత్మకంగా ప్రకటించిన కవి యరుకల యాదయ్య. 80 కవితలతో ఆయన కవిత్వం ‘ నీటి అద్దం ‘ సంపుటిగా వెలువడింది. తెలంగాణ రాష్ట్ర సాధనకై తొలి,మలిదశలో పోరాటాలలో అసువులు బాసిన అమరులకు జోహార్లు అర్పిస్తూ ఈ సంపుటిని కవి వారి స్మృతికి అంకితం ఇచ్చారు. ‘ తల్లడిల్లిన వైనం’ కవిత బతుకు కోరల్లో పడి చిక్కుకొని కర్కశంగా నలిగిపోతున్న బాల్యాన్ని హృదయ ద్రావకంగా వర్ణించింది. ‘పనికన్నా ప్రచార ఆర్భాటం ఎక్కువే’ నంటూ వర్తమాన రాజకీయాల్ని ‘ప్రజల సొమ్మే కదా!’ అన్న కవితలో కడిగేశారు. ‘ఇప్పటి పరిస్థితుల్లో నేను బతికితే చాలనుకుంటూ మనిషి ఒంటరై పోతుండు’ అని వేదన చెందారు. పని లేకున్నా మనిషికి తీరిక లేదని చెబుతూ ప్రపంచీకరణ ఉచ్చులో చిక్కుకొని ఎవరికి వారు నాలుగు గోడల నడుమ అమ్ముడైపోతూ చిత్ర విచిత్ర ఆకర్షణలలో కూలబడుతున్నారని తెలిపారు. శ్రమకు తగిన ఫలితం దక్కనంతకాలం వేసిన పాదముద్రలు చెరిపేసుకోలేక చెమటోడ్చేవాళ్లు మౌనంతో నిరీక్షణలోకి జారిపోతున్నారని అన్నారు. ‘పిడికెడు పొట్టపోసుకోవడానికి పుట్టెడు ఉపాయాలతో నిశ్శబ్దాల నింగిని చీల్చుకుంటూ ఎగిసి వెళ్లే పక్షి కునుకెప్పుడు తీస్తుందో’ అని బాధపడ్డారు.

సహజ సంపద ఘోరంగా అన్యాక్రాంతమైనప్పుడు దేశం ఎక్కడ బాగుపడేది అని వేదన చెందారు. ‘ప్రశ్న వేసుకో’ కవితలో మనిషిని జన్మ విలువ తెలుసుకొ మ్మంటారు. ఆధునికంగా ఎదుగుతున్నామని జబ్బలు చరుచుకుంటున్న మనుషులు వాస్తవాల్ని ఇప్పటికైనా సమీక్షించుకోవాలంటారు. కాలం ఎల్లదీసుకుంటూ ఆకలి బాధ తెలిసిన మనుషులే ఇప్పుడు ఎక్కువగా ఉన్నారని చెప్పారు. ప్రగతిశీల భావాలు నింపుకున్న దీపస్తంభంతో కవి ‘నందిని సిధారెడ్డి’ని పోల్చారు. ‘నీకే ఎక్కువెరుక’ కవిత కరోనా కాలపు కష్టాలను చిత్రించింది. ‘భావమాలిన్యాన్ని కడిగేసుకొని మొదట మనమే పునీతులం అవ్వాలి’ అన్నారు. నిరుద్యోగ సమూహపు వెతల్ని ‘మరో ప్రస్థానం ‘ కవిత విశ్లేషించింది. మెలికలు మెలికలుగా అల్లుకున్న విడదీయలేని జీవనాడులు మనిషిలోని ఆలోచనాతంత్రులని చెప్పారు. నాటి మానవుడు భుక్తి కోసం పుడమితో శ్రమయుద్ధం చేస్తే నేడు విజ్ఞానం పొంది తీరిక లేని స్థితిలో ఆ మానవుడే ఆకలినే మర్చిపోయిండని అన్నారు. వంచిన నడుము ఎత్తకుండా పనిచేసిన రైతన్నకు మొండి చేయి చూపే పాలక తంత్రాలను ఎండగట్టారు. మానవ సంపద కనుమరుగైనప్పుడు ఏ దేశమైనా అదృశ్యమేనని హెచ్చరించారు. సోమరితనాన్ని పోషించే మత్తుమందులు ఉచిత పంపిణీలు అని చెప్పి రాజకీయ తంత్రాల పద్మ వ్యూహాల నుండి బయటపడి వాస్తవాలను ప్రజలను గమనించి చైతన్యం పొందమన్నారు. ఎదుగుదల లేని జీవన స్థితి మనిషిని కృంగదీస్తున్నదని చెప్పారు. అశాశ్వతమైన జీవన వెలుగులకై వెంపర్లాట దేనికని మనిషిని నిలేసి ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని నిజం వైపు నిలబెట్టి భావితరాలకు వెలుగు రేఖలమవుదామని ప్రజావళికి సూచించారు. మాతృభాష తెలుగు ఉనికి బలంగా చాటి చెప్పి అది కొడిగట్టకుండా రక్షించుదామని అన్నారు . ‘సమానత్వం పేరుకే / అధికారం ఉన్నోరిదే ఆధిపత్యం ‘ అని వ్యవస్థీకృత దుస్థితిని వివరించారు.ప్రజాస్వామ్యమా నీవు బతికి ప్రజలకు బతుకు నివ్వాలని అన్నారు.

నిత్యం పంచభూతాల ప్రవాహంలో జీవించే మనిషి ఏకాకి ఎట్లా అవుతాడని ‘ సులోచనలు’ కవితలో చెప్పారు. మట్టితో బంధాన్ని మరువలేని బుద్ధి జీవులు, సహజ జ్ఞానవంతులుగా పల్లె ప్రజల్ని, రైతుల్ని పోల్చారు. సేవాతత్వాన్ని నింపుకొని మనిషిని ముందుకు సాగమన్నారు. ఆస్తులు, అంతస్తులు కూడ పెట్టడం కాదు, కాకుల అరుపులు, కుక్కల కొట్లాట లెక్క కాదు జనంలో అక్షరమై జీవించడమే తన ధ్యేయమని ‘వేదనాక్షరమై’ అన్న కవితలో స్పష్టం చేశారు. నిజం లో బతికినప్పుడు ఎవరికైనా కష్టమే అనిపిస్తుందని చెప్పారు. ప్రభుత్వం అంటే కొందరిది కాదు అందరిదీ అన్నారు. అత్యాశ మనిషికి ఘోర పరాజయ హేతువని చెప్పారు. ‘ఎందెందు చూసినా అందందే కలడు శ్రమజీవి’ అని చెమటోడ్చే మనిషిని తలచుకున్నారు. ‘నది పుట్టువడి’ కవితలో మంజీర నాదపు తరంగాల సుస్వరాలు విన్నారు. చేదును దిగమింగుతూ విశ్వనగరంలో మనిషి నిత్య జీవన ప్రయాణం సాగుతున్నదని ‘పేరుకే మనది’ కవితలో విశ్లేషించారు.’

‘తూచలేనంత’ అన్న కవిత పర్యావరణ పరిరక్షణ తక్షణ అవసరాన్ని ప్రజలకు నొక్కి చెప్పింది.’ ‘పిరమైన సదువులు’ కవిత భూతం లా విస్తరించిన విద్యా వ్యాపారాన్ని ఎండగట్టింది. మనిషి ‘ఒంటరి ఏడుపుతో నిత్యం చస్తుండు ‘ అన్న ‘జీవన యుద్ధనౌకలు’ కవిత లోని కవితా వాక్యం వర్తమాన మానవ కల్లోలిత జీవితాన్ని ఏక వాక్యమై నిర్వచించింది. అబద్ధం మూడొంతులు నిజం ఒకవంతైనప్పుడు అబద్ధమే నిజమవుతుందని, నిజమైన మాటను నమ్మే పరిస్థితులు లేకుండా పోయాయని వేదన చెందారు.’ ఆకాశం అంచున సింగిడి అందాలు / కంటిపాపల నిండా అల్లుకుంటాయి ‘ అన్న ఉదాత్త ప్రాకృతిక భావనను ‘ నీటి అద్దం’ కవితలో వెల్లడించారు. మరణం మనిషికి చివరి ఘట్టమే అయినా అంతకుమించిన శుభదినం ఏముంటుందని ‘ మరణం’ కవితలో చెబుతూ ‘అలసిన కనురెప్పలకు శాశ్వతంగా జరిగే అంతిమయాత్ర ప్రతి జీవికి ఆనందాల కౌగిలింతే కదా’ అన్న ఆర్ద్రపూరిత వాక్యాలతో ఆలోచింపజేస్తారు. కత్తులు లేని సామాన్యుడి యుద్ధమే ఓటు అన్నారు. కృత్రిమ పూతల మధ్య జీవించే మనిషికి ‘ జెర పైలం బిడ్డ’ కవిత అప్రమత్తపు జాగ్రత్తలను చెప్పింది. మనిషి జీవించినప్పుడు లోకానికి పంచిన మంచితనమే మరణించిన తరువాత అతని,’ఉనికి’ అని చెప్పారు. కనిపించని దుఃఖం నుండి స్థితప్రజ్ఞత కలిగిన మనసు కలిగినవాడిగా మనిషి ఎదగాలన్నారు. జీవుల మనుగడకు మూలం పుడమేనన్న సార్వకాలిక సత్యాన్ని విస్మరించొద్దని చెప్పారు. కంచె చేను మేస్తే సర్వం వినాశనమేనని హెచ్చరించారు. పోరాటాల పురిటి గడ్డ తెలంగాణలో స్తబ్దతకు చోటుండకూడదని ఆకాంక్షించారు. ఓటు వేసే ముందు ఆలోచించకుండా చేటేనని చెప్పి ఓటరును కీడెంచి మేలెంచమన్నారు. ‘వ్యక్తిత్వాన్ని చంపుకుంటే బతికినా సచ్చినట్టే’ అని తేల్చారు. గీతా కార్మికుల వెతల బతుకుల్ని ‘గౌడ బిడ్డ’ కవిత తెలిపింది. అసమానతల మధ్య పురోభివృద్ధి జరిగిందా అని ‘నిజమే’ అన్న కవితలో సూటిగా ప్రశ్నించారు. ‘ఇప్పుడు బతుకంతా వ్యాపారమే ‘ అని ‘గాజుబొమ్మ’ కవితలో అన్నారు. జీవనానికి దారి దీపంగా మారి నడిపించిన అమ్మతనానికి కృతజ్ఞతలు చెప్పారు. ‘అక్షరం ఏ ఒక్కరి సొత్తు కాదు / విజ్ఞానాన్ని పంచే విశ్వానిది ‘ అన్నారు. తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ప్రజాక్షేత్రంలో నిజాయితీతో సేవలందించే వారే నిఖార్సైన నాయకులని ‘మాన్యులు’ అన్న ఈ సంపుటిలోని చివరి కవితలో సామాజికుడైన కవిగా అభిప్రాయపడ్డారు. వర్తమానంలో మనిషి జీవితానికి చివరకు మిగులుతున్న అనుభవాల సారాంశాన్ని ఆకళించుకొని సామాజిక బాధ్యతతో రాసిన కవితలివి.

 

సమీక్షకులు

డా. తిరునగరి శ్రీనివాస్

9441464764

Related News

Select the Topic
Scroll to Top