ఈతరం భారతం శాస్త్రం సాంకేతికం:
ఎలక్ట్రానిక్ చెట్లు …సిలికాన్ ఇళ్ళు
3067 ఏడి సంవత్సరం. అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా లోని నేచర్ అవెన్యూ…నిజానికి అది ఒక ఆడిటోరియం.కానీ అది గాలిలో ఒక కక్ష్యలో స్థిరంగా తేలుతూ వుంటుంది.ఎప్పటికీ నిరంతరాయంగా ఎర్త్ పై అదే స్థలంలో వుంటుంది.దాని ప్రత్యేకత ఏమిటంటే అందులో మాత్రమే సహజంగా పెంచబడిన మొక్కలు,వృక్షాలతో కూడిన ప్రకృతి వుంటుంది. అందులో ఇంకో ప్రత్యేకత కూడా వుంది. అదే కీలకం.అది ఏమిటో ముందు చెపుతాను.మిగిలిన భూభాగమంతా ఎలక్ట్రానిక్ చెట్లు,సిలికాన్ ఇళ్ళు. నీరు కూడా వాయురూపంలో భద్రపరచబడి వుంటుంది. అవసరమొచ్చినపుడు దానిని ద్రవరూపంలోకి మార్చుకొని త్రాగే వీలున్న గాడ్జెట్స్ వున్నాయి.అప్పుడు ఇండియా పాపులేషన్ పది కోట్లు. అందులో వింత లేదు.అప్పుడు ప్రపంచ జనాభాయే వంద కోట్లు.ప్రజలలో ఆధునిక సంస్కృతి వల్ల నేర ప్రవృత్తి విపరీతంగా పెరిగిపోయి ఒకరినొకరు చంపుకున్నారు.మిగిలిన చాలా మంది నేషనల్ గార్డ్స్ చేతిలో చంపబడ్డారు.మనుషులను సజావుగా పరిరక్షించేందుకు నేషనల్ గార్డ్స్ ను స్థాపించారు.వారి పని మానవ ప్రవృత్తిని పరిరక్షించడం.ప్రపంచమంతా ఇదే పరిస్థితి.అందుకే జనాభా అంతా “కుదించబడింది!”మనం ముందు చెప్పుకున్న నేచర్ అవెన్యూ దగ్గరికొద్దాము.అది ఒక ఆడిటోరియం.కానీ దానిలో అదొక చిన్న ప్రపంచం.అందులో కృత్రిమంగా “సహజ” వాతావరణాన్ని కాపాడుతున్నారు.అయితే ఇప్పుడు అక్కడికి కోట్ల సంఖ్యలో ప్రజలు చేరుకుంటున్నారు.వారు తమ ఎయిరో కార్లలో అక్కడికి చేరుకుంటున్నారు.ఆ కార్లు గాలిలో ప్రయాణిస్తాయి.వాటిని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కంట్రోల్ రూమ్ నియంత్రిస్తుంది.వాటిని గమ్యస్థానాలకు చేరుస్తుంది.ఆ రోజు ఆగస్టు 23.వారికి ప్రత్యేకమైన రోజు.సంవత్సరంలో ఆ ఒక్క రోజే వారికి అందులో ప్రవేశం వుంటుంది. ఆ రోజు ప్రత్యేకత ఏమిటంటే అందులో ఒక వ్యక్తి తన కృత్రిమ నిద్ర నుంచి మేల్కొలపబడతాడు.అతడు సంవత్సరం పొడవునా ఆర్టిఫీషియల్ స్లీప్ లో వుంటాడు. అతడు అలా ఎప్పటికీ చనిపోకుండా వుండడానికి ఆ ఏర్పాటు చేశారు.అతనికి చావు లేకుండా శాస్త్రవేత్తలు కృత్రిమ ఏర్పాటు చేశారు.ఆ ఒక్క రోజే అతను మేల్కొలపబడతాడు.అతడిని చూసేందుకే/వినేందుకే అందరు ప్రజలూ అక్కడికి చేరుకున్నారు.సమయం అయింది.అతనిని శాస్త్రవేత్తలు మేల్కొలిపారు.ఒక్కసారి ఆనందంతో ప్రజలంతా గట్టిగా అరిచారు. కానీ వారి శబ్దాన్ని అక్కడి పరికరాలు వినబడకుండా లోనికి పీల్చుకున్నాయి.కేవలం అతని మాటలు మాత్రమే వినపడేందుకు ఈ ఏర్పాటు.జనాలంతా సిలికాన్ వస్త్రాలు ధరించివున్నారు.అప్పటి వాతావరణాన్ని తట్టుకునేందుకు రూపొందించబడిన కృత్రిమ వస్త్రాలు అవి.మేల్కొలపబడిన ఆ వ్యక్తి తెల్లని కాటన్ లాల్చీ పైజామా ధరించి వున్నాడు.అతని కుడి చేతికి మల్లెల దండ చుట్టబడి వున్నది. జులపాల జుట్టు కోటేరు ముక్కు.తెల్లని తెలుపు.అతడు అందరినీ పరికించి చూసి ఒక మందహాసం చేశాడు.అందరూ అలర్ట్ అయి అతనికే తమ చెవులు,కళ్ళు అప్పగించారు.అతను నెమ్మదిగా తన జేబులోంచి కాగితాలు తీసి చదవడం మొదలుపెట్టాడు. అతను ఒకటి చదవగానే అందరూ బిగ్గరగా దుఃఖించారు.అతను మరో కాగితం తీశాడు.అందరూ ఆనందంతో కేరింతలు కొట్టారు.మరో కాగితం చదవగానే అందరూ ముసిముసిగా నవ్వారు.అలా ఒక్కో కాగితం చదువుతుంటే వారు భావోద్వేగాలకు లోనయ్యారు. అతడు పూర్తి చెయ్యగానే అందరూ సంతృప్తిగా నిట్టూర్చారు.అతను ఎవరని మీకు సందేహం కలిగిందా?అతను ఒక కవి. అతను చదివింది తన కవితలను!ఆ కాలానికి వచ్చేసరికి వాతావరణంతో పాటు మనుషుల మనసులు కూడా కలుషితం అయిపోయాయి. మానవత్వం పూర్తిగా చచ్చిపోయింది.దాంతో వారిలో సహజ మానవ భావోద్వేగాలు కలిగించేందుకు నేషనల్ గార్డ్స్ ఈ ఏర్పాటు చేశారు.ఆ కవిని అందుకే శాశ్వతంగా,కృత్రిమంగా ఇలా బ్రతికిస్తూ వస్తున్నారు.ప్రజల్లో మానవత్వ ఉద్వేగాల పరిరక్షణ కోసం వారు చేసిన ఏర్పాటు ఇది!!
దండమూడి శ్రీచరణ్ , భువనగిరి 9866188266















