ఈతరం భారతం శాస్త్ర సాంకేతికాంశం :
డిజిటల్ ప్రపంచంలో ‘ఐటీ చట్టం” అంటే ఏమిటి?

భారత సుదర్శన్, సీనియర్ జర్నలిస్ట్ & విశ్లేషకులు
ఈ రోజుల్లో ఉదయం లేచిన క్షణం నుండి రాత్రి పడుకునే వరకు మన జీవితం స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్, డిజిటల్ లావాదేవీలతోనే ముడిపడి ఉంది. టీ కొట్టు దగ్గర ఇచ్చే ఐదు రూపాయల నుంచి, ఆన్‌లైన్ షాపింగ్, బ్యాంకింగ్, సోషల్ మీడియా వరకు ప్రతీదానికీ డిజిటల్ మాధ్యమాలపైనే ఆధారపడుతున్నాం. సాంకేతికత మన జీవితాలను ఎంత సులభతరం చేసిందో, అంతేస్థాయిలో కొత్త రకం ముప్పులను, ప్రమాదాలను కూడా మన ముంగిట్లోకి తెచ్చిపెట్టింది. నిన్నటివరకు దొంగతనం అంటే ఇంట్లోకి చొరబడి నగలు, డబ్బులు ఎత్తుకెళ్లడం. కానీ నేడు, మనం ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్నా సరే, చేతిలో ఉన్న ఫోన్ ద్వారానే మన అకౌంట్లు ఖాళీఅయిపోతున్నాయి
ఇలాంటి డిజిటల్ యుగంలో మనల్ని కాపాడేందుకు ప్రత్యేకమైన ఐటీ చట్టాలు, రక్షణ వ్యవస్థలు ఉన్నప్పటికీ… మెజారిటీ ప్రజల్లో వీటిపై సరైన అవగాహన లేకపోవడమే సైబర్ నేరగాళ్లకు పెద్ద ఆయుధంగా మారుతోంది.
ఈ రోజుల్లో జరుగుతున్న సైబర్ నేరాలను గమనిస్తే, అవన్నీ కేవలం సాంకేతిక లోపాల వల్ల జరగడం లేదు; మనుషుల అమాయకత్వాన్ని, భయాన్ని, ఆశను ఆసరాగా చేసుకుని జరుగుతున్నాయి. బ్యాంకు ప్రతినిధులమని చెప్పి ఓటీపీలు అడగడం, పార్సెల్ వచ్చిందని చెప్పి లింకులు పంపడం, తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని ఆశచూపి డేటాను దొంగిలించడం, సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకుని బ్లాక్‌మెయిల్ చేయడం… ఇలా రోజుకో కొత్త రూపంలో నేరగాళ్లు దాడి చేస్తున్నారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే—డిజిటల్ ప్రపంచంలో ఎవరూ కూడా సంపూర్ణ రక్షణలో లేరు. ఒక్క చిన్న అజాగ్రత్త మన ఆస్తిని, గౌరవాన్ని ప్రమాదంలో పడేస్తుంది.
మన దేశంలో డిజిటల్ ప్రపంచాన్ని క్రమబద్ధీకరించడానికి, ఆన్‌లైన్ లావాదేవీలకు చట్టబద్ధత కల్పించడానికి, సైబర్ నేరాల నుండి పౌరులకు రక్షణ ఇవ్వడానికి ప్రత్యేకమైన శాసనాలు ఉన్నాయి. ఆన్‌లైన్ మోసాలు, హ్యాకింగ్, గోప్యతా భంగం, సోషల్ మీడియా వేధింపులు వంటి చర్యలు తీవ్రమైన నేరాల కిందకే వస్తాయి. అయితే, చాలామంది బాధితులు “మనకేం తెలుస్తుందిలే?”, “పోలీసుల చుట్టూ తిరగాలా?” అనే భయంతో లేదా అవగాహన లేమితో సైలెంట్‌గా ఉండిపోతున్నారు. ఇది నేరగాళ్లకు మరింత బలాన్నిస్తోంది.
ఏదైనా సైబర్ మోసం జరిగినప్పుడు కాలయాపన చేయకుండా వెంటనే స్పందించడం చాలా అవసరం. మోసం జరిగిన తొలి కొన్ని గంటలు అత్యంత కీలకమైనవి. బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయినా, ఆన్‌లైన్ వేధింపులకు గురైనా భయపడకుండా సరైన వేదికలపై ఫిర్యాదు చేయాలి. ఆధారం లేకుండా ఏ లింక్‌పైనా క్లిక్ చేయకపోవడం, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోకపోవడం, డిజిటల్ భద్రతా నియమాలను పాటించడం వల్ల సగం సమస్యలను నివారించవచ్చు.
సాంకేతికతను వాడటం ఎంత ముఖ్యమో… దాని సరిహద్దులు, దాగి ఉన్న ప్రమాదాలు, మనకున్న రక్షణల గురించి స్పృహ కలిగి ఉండటం అంతకంటే ముఖ్యం. సాంకేతికతను సరైన రీతిలో వినియోగిస్తూ, అప్రమత్తతతో వ్యవహరించినప్పుడే డిజిటల్ ప్రపంచంలో మనం సురక్షితంగా ఉండగలము.
అసలు ఈ ఐటీ చట్టం ఎలా పుట్టుకొచ్చిందో తెలుసుకోవడం కూడా ఎంతో ఆసక్తికరం. 1990ల చివర్లో ఇంటర్నెట్ యుగం వేగంగా విస్తరిస్తున్న సమయంలో, ఐక్యరాజ్యసమితి (UNCITRAL) ఇ-కామర్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఒక నమూనా చట్టాన్ని సూచించింది. దాని ఆధారంగానే, డిజిటల్ లావాదేవీలకు, ఇ-సంతకాలకు చట్టబద్ధత కల్పిస్తూ భారత పార్లమెంట్ 2000 మే నెలలో ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్’ను ఆమోదించింది. అప్పటివరకు కేవలం కాగితాల మీద సంతకాలకే పరిమితమైన మన చట్టపరమైన వ్యవస్థ, ఆ క్షణం నుంచే డిజిటల్ యుగంలోకి అడుగుపెట్టింది. కాలక్రమేణా సాంకేతికత మారినట్లే, ఈ చట్టంలోనూ అనేక కీలక మార్పులు వచ్చాయి. మరి ఆ విశేషాలు, నేటి సమాజంలో జరుగుతున్న వింతైన సైబర్ నేరాల వెనుక ఉన్న చట్టపరమైన అంశాలను రాబోయే వ్యాసాలలో ఒక్కొక్కటిగా విశ్లేషించుకుందాం!















