బెంగళూరు మార్చ్ 18 ఈతరం భారతం:
రీల్స్ కోసం బెంగళూరు లో ఓ కూతురు తన తండ్రి ప్రాణాలతో చెలగాటం ఆడింది. ప్రయాణానికి బస్సు టికెట్లు దొరక్కపోతే పడే ఇబ్బందులను చెప్పడానికి.. తన తండ్రిని గోనె సంచిలో కుక్కి కొరియర్ చేయబోయింది. కానీ గోనె సంచిలో ఏదో కదులుతున్నట్లు సిబ్బంది గమనించడంతో విషయం బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ప్రాంతంలో నివసించే ఓ యువతి.. తన తండ్రిని పెద్ద బస్తాలో కుక్కింది. ఆ తర్వాత బస్తాకు దారం గట్టి.. ఓ ప్రైవేటు కొరియర్ సంస్థకు కాల్ చేసింది. తన వద్దర భారీ పార్సిల్ ఉందని డెలివరీ చేయాలని కోరారు. దీంతో యువతి ఇంటికి చేరుకున్న కొరియర్ సిబ్బంది బస్తాను నేరుగా కొరియర్ ఆఫీసుకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో బస్తాలో ఏదో కదులుతున్నట్లు సిబ్బంది గమనించారు. దీంతో ఆఫీసుకు వచ్చాక బస్తాను తెరవాలని యువతిని కోరారు. అందుకు ఆమె నిరాకరించడంతో స్వయంగా సిబ్బంది గోనె సంచిని తెరిచి చూడగా.. అందులో ఓ వ్యక్తి కనిపించాడు.ఈ వ్యవహారంపై పోలీసులకు కొరియర్ సిబ్బంది సమాచారం అందించారు. కొరియర్ ఆఫీసుకు వచ్చిన పోలీసులు.. గోనె సంచిలోని వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, సదరు యువతిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా.. కేవలం రీల్స్ కోసమే ఈ పనిచేశానని తెలిపింది. దీంతో సదరు కుటుంబానికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు.ఈ క్రమంలో క్షమాపణలు చెబుతూ యువతి ఓ వీడియో చేసింది. ఉగాది, రంజాన్ వంటి పండుగల సమయంలో బస్సు టికెట్లు తరచుగా అందుబాటులో ఉండవు. ఆ సమయంలో ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులను తెలియజేయడానికే ఈ వీడియో చేశానని యువతవి అందులో పేర్కొన్నారు. అందులో సదరు యువతి, ఆమె అత్త, భర్త ఉన్నారు.















