ఈతరం భారతం వార్తాంశం:
———————————
మనం మనది అనుకునే భూముల్లో చాలా రకాలుంటాయి. వాటిలో కొన్ని శాశ్వత హక్కులున్నవి అయితే, మరికొన్ని తాత్కాలికంగా అనుభవించేవి. వీటి గురించి ప్రతి ఒక్కరు కనీస అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా నిషేధిత భూముల జాబితా (22 ఎ)పై చర్చ నడుస్తున్న ఈ తరుణంలో ఇది చాలా ముఖ్యం. మనం భూమి కొనుగోలు చేయాలనుకున్నా అన్ని విషయాలనూ పరిశీలించాలి.
పట్టా భూములు: ప్రైవేటు యాజమాన్యం కింద ఉన్న భూములు. పట్టాదారు పాసుపుస్తకం జారీ చేస్తారు. రెవెన్యూ రికార్డుల్లో 1- బి రిజిస్టర్‌లో నమోదై ఉంటాయి. క్రయవిక్రయాలు, వారసత్వ బదిలీ, భాగపంపిణీ, దానం, బహుమతి, జీపీఏ, ఏజీపీఏ ఇవ్వడానికి యజమానికి హక్కులు ఉంటాయి.
ఎసైన్డ్/ లావుణి: ప్రభుత్వం పేదలకు, భూమి లేని వారికి సాగు, నివాసానికి పంపిణీ చేసిన భూమి. 1977 పీవోటీ చట్టం ప్రకారం క్రయవిక్రయాలు నిషేధం. వారసులకు హక్కులు బదిలీకి అవకాశం. అనుభవ హక్కు మాత్రమే ఉంటుంది.
దేవాదాయ: దేవుళ్లు, ఆలయాల పేరుతో వాటి నిర్వహణకు కేటాయించిన భూములు.
వక్ఫ్ ల్యాండ్స్: మసీదులు, దర్గాలు, కబరస్థాన్‌ల నిర్వహణ కోసం కేటాయించినవి. వక్ఫ్ బోర్డు పర్యవేక్షిస్తుంది.
భూదాన్/ గ్రామదాన్: ఆచార్య వినోబా భావే చేపట్టిన భూదానోద్యమం సందర్భంగా భూస్వాములు స్వచ్ఛందంగా ఇచ్చినవి. భూదాన్ యజ్ఞ బోర్డు ద్వారా కొంత విస్తీర్ణం పేదలకు పంచారు. ప్రభుత్వం పరిధిలోనే ఉంటాయి.
ఇనాం/ సేవా ఇనాం: పూర్వ కాలంలో రాజులు, జమీందార్లు, నవాబులు, సంస్థానాలు, ఆంగ్లేయులు బహుమతిగా ఇచ్చినవి. 1955లో ఇనాం చట్టం రద్దుతో ప్రభుత్వ నిర్వహణ పరిధిలోకి వచ్చాయి. ఆధీన ధ్రువీకరణ పత్రం (ఓఆర్‌సీ) పొందిన వారికి పట్టా భూమి మాదిరి హక్కులు వర్తిస్తాయి. లేదంటే వారసత్వ బదిలీకి మాత్రమే అవకాశం ఉంటుంది.
సీలింగ్ భూములు/మిగులు (సర్‌ప్లస్): వ్యవసాయ భూముల పరిమితి చట్టం (ల్యాండ్ సీలింగ్ చట్టం- 1973) ద్వారా భూ స్వాముల నుంచి స్వాధీనం చేసుకున్న కొంత భూమిని పేదలకు సీలింగ్ పట్టాల పేరుతో పంపిణీ చేశారు. మిగులు భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉంది. 1976లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం తీసుకురాగా 2008లో రద్దు చేశారు.
మాజీ సిపాయి (ఎక్స్ సర్వీస్‌మెన్): ప్రభుత్వ రక్షణ దళాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన సైనికులు, వీర మరణం పొందిన వారి కుటుంబాలకు కేటాయించే భూమి. పదేళ్ల పాటు ఎసైన్డ్ హక్కుల మాదిరే నిబంధనలు వర్తిస్తాయి. తర్వాత ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) పొందడం ద్వారా పూర్తి హక్కులు సంక్రమిస్తాయి.
సర్కారీ / రెవెన్యూ భూములు: ప్రభుత్వ భూమి. దీని నిర్వహణ రెవెన్యూశాఖ చూస్తుంది.
పోరంబోకు, బంజరు: వినియోగంలో లేని కొండలు, వాగులు, పడావు భూములు. సామాజిక అవసరాలకు వీటిని ప్రభుత్వం కేటాయిస్తుంది.
గైరాన్ భూమి: పశువుల మేతకోసం వదిలిన భూములను ఈ పేరుతో పిలుస్తారు. ప్రభుత్వమే హక్కుదారు.
బంచరాయి/గాయాలు/ కామన్ బాన్జర్: పశువుల మేత కోసం ప్రభుత్వం కేటాయించిన మైదానాలు. ఇవి ప్రభుత్వ భూముల కిందకే వస్తాయి.
గ్రాంట్/ డి- పట్టా: దరఖాస్తు ఫారం ద్వారా ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములు ఇవి. డికేటీ అనికూడా పిలుస్తారు. అసైన్డ్ మాదిరే హక్కులు వర్తిస్తాయి.
జిరాయితీ ల్యాండ్స్: పాత రెవెన్యూ రికార్డుల్లోని పదం ఇది. ప్రైవేటు వ్యవసాయ భూములు ఇవి.
చుక్కల భూములు: రెవెన్యూ రీ సెటిల్‌మెంట్ రిజిస్టర్ (ఆర్‌ఎస్‌ఆర్) రూపొందించిన సమయంలో యాజమాన్య హక్కు పత్రాలు లేని భూములను ప్రభుత్వ లేదా ప్రైవేటు భూములని నిర్ధరించకుండా రికార్డుల్లో చుక్కలు పెట్టారు.
శత్రు ఆస్తులు (ఎనిమీ ప్రాపర్టీస్): 1962లో చైనా యుద్ధం, 1965, 1971 పాకిస్తాన్‌తో యుద్ధం, 1947లో దేశ విభజన.. ఈసమయాల్లో వలస వెళ్లినవారి ఆస్తులు. 1968 ఎనిమీ ప్రాపర్టీస్ చట్టం పకారం కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఫర్ ఇండియా అనే సంస్థ పరిధిలోకి వస్తాయి. క్రయవిక్రయాలు చెల్లవు.
సివాయి జమాదారి (శివాయి జమేదారి): ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటూ తాత్కాలిక శిస్తు/ పన్ను చెల్లించే భూములు. ఇవి పూర్తిగా ప్రభుత్వ భూములు.
ఎఫ్టీఎల్, శిఖం, బఫర్: చెరువులు, జలాశయాల పూర్తి స్థాయి నీటి మట్టం (ఎఫ్టీఎల్) వరకు ఉండే భూమి. జలాశయాల వెనుక ఉండేది శిఖం. జలాశయం చుట్టూ రక్షణ కోసం కేటాయించేది బఫర్. ఇవి ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉంటాయి.
భూ సేకరణ: ప్రజా అవసరాలకు (రాష్ట్ర/ కేంద్రం) భూ సేకరణ చట్టం-2013ను అనుసరించి పరిహారం చెల్లించి సేకరించిన పట్టా భూముల యాజమాన్య హక్కులు ప్రభుత్వ పరిధిలోకి చేరుతాయి. వీటిని నిషేధిత జాబితాలో (22 ఎ) చేర్చుతారు.
అటవీ/ ఆర్వోఎఫ్ భూములు: అటవీశాఖ పరిధిలోని భూములకు కేవలం అటవీశాఖ మాత్రమే హక్కుదారు. అడవుల్లో పోడు వ్యవసాయం చేసుకునే వారికి అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006 కింద హక్కు పత్రాలు ఇచ్చారు. వారసత్వ బదిలీ, ప్రభుత్వ పథకాలు పొందడానికి అర్హులు. ఏ ఇతర హక్కులు వర్తించవు.















