హైదరాబాద్ మార్చ్ 5 ఈతరం భారతం:
హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై ఇటీవల నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై తీవ్ర చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తాజాగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. ఒక వ్యక్తి ఏ దుస్తులు వేసుకోవాలనేది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయమని, దానిపై ఇతరులు తీర్పు ఇవ్వడం సరైంది కాదని ఆమె అన్నారు. మీకొక చెల్లి ఉంటే ఆమె షార్ట్ వేసుకుని బయటకు వెళ్తే రేప్ చేయాలని మీకు అనిపిస్తుందా? మహిళల డ్రెస్సింగ్‌ను ఎందుకు తప్పుబడతారు? ఒక అమ్మాయి బ్రా స్ట్రాప్ అనుకోకుండా బయటకు కనిపిస్తే అది పెద్ద తప్పు చేసినట్లుగా లేదా ప్రపంచమే అంతమైపోయినట్లుగా ఎందుకు చూస్తారని ఆమె ప్రశ్నించారు. బ్రా అనేది కేవలం ఒక ఇన్నర్‌వేర్ మాత్రమేనని, అది మహిళలకు సాధారణమైన మరియు అవసరమైన వస్త్రమని ఆమె స్పష్టం చేశారు వరలక్ష్మీ శరత్ కుమార్. మగవారి దుస్తులతో పోల్చుతూ కూడా వరలక్ష్మి ఒక ఉదాహరణ ఇచ్చారు.మగవారు జీన్స్ ప్యాంట్ వేసుకుని వంగినప్పుడు వారి లోదుస్తులు కనిపించడం సాధారణమేనని, కానీ దాన్ని చూసి ఎలాంటి మహిళా వారిపై అఘాయిత్యాలకు పాల్పడదు కదా అని ఆమె అన్నారు. మరి మగవారి విషయంలో అభ్యంతరం లేకపోతే, మహిళల విషయంలో మాత్రమే ఎందుకు విమర్శలు వస్తున్నాయో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఈ విధమైన ద్వంద్వ వైఖరి సమాజంలో మారాల్సిన అవసరం ఉందని వరలక్ష్మి స్పష్టం చేశారు. మహిళల దుస్తులను విమర్శించడం కంటే, మనుషుల ఆలోచనలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. సమాజంలో మహిళలకు గౌరవం ఇవ్వడం అత్యంత ముఖ్యమని, వారి వ్యక్తిగత స్వేచ్ఛను అందరూ గౌరవించాలని ఆమె అన్నారు. ప్రస్తుతం వరలక్ష్మీ శరత్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. కొందరు ఆమె అభిప్రాయాలను సమర్థిస్తుండగా, మరికొందరు భిన్నంగా స్పందిస్తున్నారు. అయితే మహిళల హక్కులు, స్వేచ్ఛలపై ఈ చర్చ మళ్లీ ప్రధాన అంశంగా మారింది.















