హైదరాబాద్ మార్చ్ 3 ఈతరం భారతం:
గత మూడు నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వింతవింత రాజకీయ చేష్టలకు పాల్పడుతోంది. అధికారంలోకి వచ్చి 26 నెలలు కావొస్తున్నా, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో మాత్రం పూర్తిగా విఫలమైందని బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్ విమర్శించారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు సహా అన్ని హామీలు అమలు చేస్తామని గొప్పగా ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. ప్రజలు ఇప్పుడు “ఎందుకు కాంగ్రెస్‌కు ఓటేశామా?” అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మూసీ పునరుజ్జీవం పేరుతో, గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరిట ప్రజల భూములపై కాంగ్రెస్ ప్రభుత్వం కన్నేసింది. మూసీ, ఈసా నదులు కలిసే ప్రాంతానికి సమీపంలో ఉన్న ప్రైవేట్ వ్యక్తుల భూములను అగ్గువ ధరలకు స్వాధీనం చేసుకుని కాంట్రాక్టర్లకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందన్నారు. తరతరాలుగా వారసత్వంగా వచ్చిన ఖరీదైన పట్టా భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాదిత గాంధీ సరోవర్‌కు దూరంగా ఉన్న భూములను కూడా కాజేసే ప్రయత్నం జరుగుతోంది మూసీ బఫర్ జోన్ విషయంలో ప్రభుత్వం ఇప్పుడు రకరకాల ప్రకటనలు చేస్తోంది. కానీ ఇదే ప్రాంతాల్లో గతంలో అధికారంలో ఉన్నప్పుడు అపార్ట్‌మెంట్లకు అనుమతులు ఇచ్చింది. ఇప్పుడు అన్ని పర్మిషన్లు ఉన్న పేదల ఇళ్లను కూల్చివేయడం అన్యాయం. కొందరు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారిని, రేవంత్ రెడ్డిని పోలుస్తూ చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.. యూపీలో బుల్డోజర్ చర్యలు ప్రభుత్వ భూములను ఆక్రమించినవారిపై, మాఫియా, క్రిమినల్ ఎలిమెంట్స్‌పై మాత్రమే జరుగుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్ గారు ప్రజా హక్కులను కాపాడుతూ, నేరస్థులపై, ఇల్లీగల్ స్ట్రక్చర్స్‌పై మాత్రమే బుల్డోజర్లను ఉపయోగిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపైనే చర్యలు తీసుకుంటున్నారు. కానీ తెలంగాణలో మాత్రం లీగల్ నిర్మాణాలపైనా, పేదల ఇండ్లను కూల్చుతూ గడ్డపార ప్రభుత్వంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేరళలో ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ నుంచి గాంధీ కుటుంబానికి వెయ్యి కోట్లు పంపాలంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం దారుణం. తెలంగాణలో ప్రజలు ఆత్మహత్యలు… కాంగ్రెస్ మాత్రం వసూళ్లు వైద్యం చేయించుకోలేక, రిటైర్మెంట్ డబ్బులు రాక, అప్పుల భారం తట్టుకోలేక ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం “రూ.1000 కోట్లు” అంటున్నాడు. ఇంత దారుణం మరెక్కడాలేదు. సీఎం రేవంత్ రెడ్డి “రాహుల్ గాంధీని ప్రధాని చేస్తామని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి రేవంత్ ఆశ నెరవేరదనే విషయం గుర్తుంచుకోవాలి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతోంది. కేవలం కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారింది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమై ఉంది. కర్ణాటకలో కిస్సా కుర్సీకా అనే మాదిరిగా సీఎం, డిప్యూటీ సీఎం మధ్య కుర్చీ కొట్లాట జరుగుతోంది. అధికార పోరు, అంతర్గత విభేదాలు బహిరంగంగానే కనిపిస్తున్నాయి. ఇటు తెలంగాణలో ఖమ్మం బ్యాచ్, మరోవైపు నల్లగొండ బ్యాచ్ రేవంత్ రెడ్డి సీటుకు ఎసరు పెట్టి ఎప్పుడు సీఎం అవుదామనే ఎదురుచూస్తున్నరు. ఇలా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాని దేశ ప్రజలలో గొప్ప విశ్వాసాన్ని పొందారు. ప్రపంచ దేశాలు కూడా ఆయనను స్ట్రాంగ్ లీడర్‌గా చూస్తున్నాయి. దేశంలో సుపరిపాలన, అభివృద్ధి, భద్రత అందించడం ఆయనకే సాధ్యమైంది. ఈ క్రమంలో వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రి అయ్యారు. మోదీ ప్రభుత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకెళ్తోంది. అందుకే 2047 వరకు దేశ ప్రజల విశ్వాసంతో ప్రధానమంత్రి పదవి బలంగా కొనసాగుతుంది. 2047 వరకు ప్రధానమంత్రి సీటు ఖాళీ లేదు. కాని సీఎం రేవంత్ రెడ్డి ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి.. వైఫల్యాలతో, ఫెయిల్యూర్ పాలనతో, గడ్డపార పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నందుకు ప్రజలు తగిన సమాధానం చెప్పే రోజు దూరంలో లేదు. 2028లో మార్పు ఖాయం. భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. బీజేపీ అభ్యర్థే తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారు. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వచ్చి ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఢిల్లీకి వెళ్లిపోయారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదు.* ఎన్నికల ముందు అశోక్‌నగర్ కు వచ్చిన రాహుల్ గాంధీ నిరుద్యోగులతో సమావేశమై రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాని ఆ హామీని నెరవేర్చలేదు. రాహుల్ గాంధీకి, అదే నిరుద్యోగుల ముందుకు వెళ్లే ధైర్యం ఉందా? అందుకే ప్రజలకు మొహం చూపించే ధైర్యంలేక తోకముడిచారు.* అబద్ధాలతో రాజ్యాంగాన్ని పదేపదే అవమానపరుస్తూ, రాజ్యాంగ వ్యవస్థలను, ఎన్నికల కమిషన్ ను అవమానపర్చేలా, కించపర్చేలా మాట్లాడుతున్న రాహుల్ గాంధీకి అర్హత లేదు. గ్యారంటీలు, హామీలు నెరవేర్చలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సీఎం కుర్చీని కాపాడుకునేందుకు… రాహుల్ గాంధీని పొగడ్తలతో ముంచెత్తి భజన చేస్తున్నారని ఎద్దేవా చేసారు.. 150 డివిజన్లు ఉన్న జీహెచ్ఎంసీని 300 డివిజన్లుగా విభజించి, ఒక్క కార్పొరేషన్‌ను అశాస్త్రీయంగా మూడు ముక్కలుగా చేయడం వెనుక భారతీయ జనతా పార్టీని రాజకీయంగా దెబ్బతీయాలనే అక్కసే కారణం. ఉదాహరణకు… బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేది ఒక కార్పొరేషన్ లో అయితే.. ఎన్ వోసీ తీసుకోవాలంటే కార్పొరేషన్ కు లేదా మరోచోటకు వెళ్లాల్సివస్తోంది. ఇది దుస్థితి. హైదరాబాద్ కోర్ సిటీని మజ్లిస్ పార్టీకి అప్పగించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ సర్కారులో నగర పాలన పూర్తిగా గాడి తప్పింది. హైదరాబాద్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తీవ్రమయ్యాయి. చెత్త నిర్వహణ దారుణంగా ఉంది, తాగునీటి కొరత, రోడ్ల దుస్థితి, డ్రైనేజీ వ్యవస్థ అధ్వానం, ట్రాఫిక్ అస్తవ్యస్త పరిస్థితి—ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలను స్పష్టంగా చూపిస్తున్నాయి జీహెచ్‌ఎంసీ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం తగిన నిధులు కేటాయించలేదు. మౌలిక సదుపాయాలపై సరైన శ్రద్ధ లేదు. పారిశుధ్యం, రోడ్లు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఫలితంగా హైదరాబాద్ నగరం అభివృద్ధి పరంగా వెనుకబడుతోంది. కేంద్ర ప్రభుత్వం సాస్కి (Special Assistance to States for Capital Investment) పథకం కింద తెలంగాణ పురపాలక శాఖకు రూ.650 కోట్ల వడ్డీలేని రుణాన్ని మంజూరు చేసిందని తెలిపారు. ఇది గత పదేళ్లలో రాష్ట్రానికి అందిన అత్యంత పెద్ద మొత్తాల్లో ఒకటి. ఈ మూలధన పెట్టుబడి నిధులు మునిసిపాలిటీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రోడ్లు, పట్టణీకరణ, జియో ట్యాగింగ్, ఆస్తి పన్నుల డిజిటలైజేషన్, మాస్టర్ ప్లాన్ రూపకల్పన వంటి సమగ్ర సంస్కరణలకు వినియోగించేందుకు ఉద్దేశించబడ్డాయన్నారు. 50 ఏళ్ల కాలపరిమితితో, వడ్డీలేమీ లేకుండా ఈ రుణం ఇవ్వడం ద్వారా కేంద్రం తెలంగాణ పట్టణాభివృద్ధికి విశ్వసనీయ మద్దతు అందిస్తోందన్నారు.. మొదటి దశలో రూ.650 కోట్లు విడుదల కాగా, సరైన వినియోగం ఆధారంగా త్వరలో మరో రూ.250 కోట్లు అందే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఓవైపు తెలంగాణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుంటే.. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విభిన్నంగా వ్యవహరిస్తోంది. జీహెచ్‌ఎంసీని అవ్యవస్థితంగా మూడు ముక్కలుగా విభజించడం ద్వారా వ్యవస్థలను బలహీనపరుస్తోంది. ఇది ప్రజలకు తీరని అన్యాయం మాత్రమే కాకుండా, కేంద్రం ఇచ్చిన నిధుల సద్వినియోగానికి కూడా పెద్ద అడ్డంకిగా మారే ప్రమాదం ఉందన్నారు..ఈ మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు , బిజెపి సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ సుమిరన్ తదితరులు పాల్గొన్నారు.















