హైదరాబాద్ మార్చ్ 4 ఈతరం భారతం:
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్నారు. ఈ రెండు సంవత్సరాల కాలంలో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ చూడని విధంగా పరిపాలనా అస్థిరత తెలంగాణలో కనిపిస్తోందని భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ గారు విమర్శించారు.కాంగ్రెస్ సర్కారుకు విజన్ లేదు… మిషన్ లేదు… కేవలం కమీషన్లతో పాలన నడిపిస్తూ, అధికారాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా మారిందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. అదే సమయంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కూడా రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటున్నారు. ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో జరిగిన పరిణామాలను చూస్తే, దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి కనిపించలేదేమో అన్న భావన కలుగుతోందని ఎన్.వి.ఎస్.ఎస్. విమర్శించారు.గత రెండేళ్లలో సుమారు 60 సార్లు రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా ఇతర ఉన్నతాధికారుల బదిలీలు కూడా దాదాపు 60 సార్లకు పైగానే జరిగాయని తెలిపారు. పరిపాలనలో స్థిరత్వం లేకపోవడం, ఒక స్పష్టమైన దిశా నిర్దేశం లేకపోవడం వల్లే ఇంత భారీ స్థాయిలో బదిలీలు జరుగుతున్నాయని ఆరోపించారు.ఇక ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనల విషయానికొస్తే, తన పదవిని పదిలం చేసుకోవడానికే 60 సార్లకుపైగా ఢిల్లీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఇది రాష్ట్ర ప్రయోజనాల కంటే వ్యక్తిగత రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని సూచిస్తోందని అన్నారు. మొత్తానికి, ఇది ఒక దశ, దిశలేని ప్రభుత్వం లాగా పనిచేస్తోందని, దూరదృష్టి లోపించిందని, పాలనపై పట్టులేకపోవడమే ఇన్నిసార్లు ఉన్నతాధికారుల బదిలీలకు కారణమని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడుతోందని ప్రభాకర్ స్పష్టం చేశారు.నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 99 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకటించి, అన్ని కలెక్టర్లు కనీసం 10 రోజులు గ్రామాల్లోనే ఉండి ప్రజల్లో తిరగాలని ఆదేశించడం గమనార్హమని ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ వ్యాఖ్యానించారు. అంటే గత రెండు సంవత్సరాలుగా అధికారులు గ్రామాల్లో తిరగలేదా? ప్రజలను నేరుగా కలవలేదా? అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతోందని అన్నారు. ఇదే విషయాన్ని ఇంతకుముందు జరిగిన సీఎల్పీ సమావేశంలో కూడా ఎమ్మెల్యేలకు “జనాల్లోకి వెళ్లాలి, ప్రజల సమస్యలు పట్టించుకోవాలి” అని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.ఈ పరిణామాలను బట్టి చూస్తే, “నోబడీ ఈజ్ లిసనింగ్ టు హనరబుల్ సీఎం” అన్న భావన స్పష్టమవుతోందని విమర్శించారు. ముఖ్యమంత్రి చెప్పినా అమలు జరగడం లేదంటే, పాలనపై పట్టులేదనే విషయం బయటపడుతోందని అన్నారు. మొత్తానికి ఈ ప్రభుత్వానికి స్పష్టమైన విజన్ లేదు, మిషన్ లేదు — కేవలం కమిషన్ కోసం మాత్రమే పని చేస్తున్నట్టుగా కనిపిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించారు.జీహెచ్ఎంసి పరిధిని విస్తరించి 300 సీట్లతో గ్రేటర్ హైదరాబాద్ ఏర్పాటు చేసి, ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే మూడు ముక్కలు చేయడం దూరదృష్టి లోపానికి ఉదాహరణ అన్నారు. ఒక నిర్ణయం తీసుకునే ముందు స్పష్టమైన ప్రణాళిక, లక్ష్యం ఉండాలన్నారు. పురపాలక సంఘాల రిజర్వేషన్ల విషయంలో జిహెచ్ఎంసిని ఒకటిగా చూపించి రిజర్వేషన్లు ఖరారు చేసి, అనంతరం మూడు భాగాలుగా విభజించడం రిజర్వేషన్ ప్రక్రియను దెబ్బతీసే చర్యగా కనిపిస్తోందన్నారు.రాష్ట్రంలో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకవైపు పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో విచారణలో ఉండగా, మరోవైపు స్పీకర్ స్థాయిలో కూడా నోటీసులు జారీ అవుతున్నాయి. కొందరికి క్లీన్ చిట్‌లు ఇస్తున్నారు, మరికొందరు నోటీసులకు సమాధానాల కోసం సమయం కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ.. తాము పోరాడుతున్నామని, తామే నిజమైన ప్రతిపక్షమని చెబుతోంది. అయితే ఇటీవల జరిగిన పురపాలక సంఘాల ఎన్నికల్లో కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య.. ఉత్తుత్తి పోటీ మాత్రమేనని స్పష్టంగా అర్థమైందని ఎన్.వి.ఎస్.ఎస్. తెలిపారు.గత రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల సమయంలో అవకాశం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పోటీ చేయలేదు. ఇప్పుడు కూడా పోటీపై నిర్ణయం తీసుకోకుండా, స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేయడం వెనుక మతలబు ఏంటని ప్రభాకర్ ప్రశ్నించారు. ఒకవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలు తాము బిఆర్ఎస్‌లోనే ఉన్నామని ప్రకటిస్తుంటే, స్పీకర్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మరికొంతమంది నోటీసులకు సమాధానం ఇవ్వడానికి గడువు కోరుతున్న పరిస్థితి ఉందన్నారు. ఇటువంటి సమయంలో రాజ్యసభ ఎన్నికలు బిఆర్ఎస్‌కు ఒక ఆయుధంగా, ఒక అవకాశంగా మారాయని ప్రభాకర్ పేర్కొన్నారు.ఈ ఫిరాయింపుల అంశం పతాక స్థాయికి చేరుకున్న ఈ తరుణంలో — అసలు ఏ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడన్నది తేల్చుకునే అవకాశం వచ్చినప్పటికీ — బిఆర్ఎస్ మాత్రం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామా లేదా అన్న విషయంపై స్పష్టత ఇవ్వకుండా ఉండటం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోందన్నారు.అందుకే బిఆర్ఎస్–కాంగ్రెస్ మధ్య జరుగుతున్నది స్ట్రీట్ ఫైట్ కాదు, స్ట్రెయిట్ ఫైట్ కాదు — కేవలం “డూప్ ఫైట్” మాత్రమేనని ఘాటుగా వ్యాఖ్యానించారు. విలీనం చేసుకోవాలనుకుంటే బహిరంగంగా ప్రకటించాలి, పొత్తు పెట్టుకోవాలనుకుంటే స్పష్టంగా చెప్పాలి అని బీజేపీ తరఫున నిలదీశారు. కాగితాల మీద పోరాటాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు ఎంతకాలం కొనసాగుతాయని ప్రశ్నించారు.















