ఈ తరం భారతం ఖమ్మం, అక్టోబర్ -08: ఖమ్మం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పి.సి. పి.ఎన్.డి.టి. చట్టం- 1994 ప్రకారం అనధికారికంగా ఉపయోగిస్తున్న పోర్టబుల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ కళావతి బాయి ఒక ప్రకటనలో తెలిపారు.
డిప్యూటీ జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ చందు నాయక్, ఖమ్మం అర్బన్ పోలీస్ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని, తనిఖీ సమయంలో హిటాచీ మోడల్ EUB-405 PLUS పోర్టబుల్ అల్ట్రాసౌండ్ యంత్రం, ఒక ప్రోబ్, రెండు అల్ట్రాసౌండ్ జెల్ సీసాలను సాక్షుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ యంత్రాలు నిర్దిష్ట అధికార రిజిస్ట్రేషన్ లేకుండా పనిచేస్తున్నట్లు గుర్తించామని, ఇందులో సల్లోజా వెంకటేష్ (వయసు 30, పాండురంగపురం, ఖమ్మం రూరల్), బానోత్ హుస్సేన్ (వయసు 40, వైఎస్సార్ కాలనీ, ఖమ్మం అర్బన్) సంఘటన స్థలంలో ఉన్నారని అన్నారు. తక్షణమే పంచనామా నిర్వహించి, అధికారిక ఫిర్యాదు ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్ లో పి.సి.పి.ఎన్.డి.టి. ఇతర సంబంధిత చట్టాల ఆధారంగా కేసు నమోదు చేయడం జరిగిందని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారిణి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.















