ఈతరం భారతం మెదక్ డిసెంబర్ 23
మెదక్: క్రిస్మస్ వేడుకల సందర్భంగా మెదక్‌లోని చర్చ్‌కు భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీస్ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు మాట్లాడుతూ, మొత్తం 500 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పోలీసులను 4 సెక్టార్లు, 3 షిఫ్టులుగా విభజించి విధులు కేటాయించామని చెప్పారు. బందోబస్తులో 4 డీఎస్పీలు, 12 సీఐలు, 47 ఎస్సైలు, 31 ఏఎస్సైలు, 46 హెడ్ కానిస్టేబుళ్లు, 185 పోలీస్ కానిస్టేబుళ్లు, 87 హోంగార్డులు, 3 క్యూఆర్టీ బృందాలు, 3 రోప్ పార్టీలు పాల్గొంటున్నాయని వివరించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీసీ కెమెరాలతో నిరంతర నిఘా కొనసాగుతోందన్నారు.భక్తులు వాహనాలను కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలపాలని, విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. ఆకతాయిల నియంత్రణకు షీ టీమ్స్, మఫ్టీ పార్టీలను మోహరించామని, భద్రతలో భాగంగా బీడీ టీమ్స్, డాగ్ స్క్వాడ్‌లు పనిచేస్తున్నాయని తెలిపారు. చిన్నారులు తప్పిపోతే ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎస్. మహేందర్, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, రంగా నాయక్‌తో పాటు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.















