ఈతరం భారతం రంగారెడ్డి ఆగస్టు 2 :రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి సర్వే నం.91/2లో పలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలను నిర్మించేందుకు కేటాయిస్తూ శనివారం రెవెన్యూ సెక్రటరీ లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.అక్కడే శేరిలింగంపల్లి, గండిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి స్థలాన్ని అలాట్ చేశారు. గతంలో సర్వే నం.91/2లో 15.20 ఎకరాల స్థలాన్ని తెలంగాణ అకాడమి ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్కి కేటాయించారు. అది ఖాళీగా ఉంది. అందులో నుంచే 3 ఎకరాలను రిజిస్ట్రేషన్ శాఖకు అప్పగించారు. ల్యాండ్ అలాట్మెంట్ కి సాధ్యాసాధ్యాలపై సీసీఎల్ఏకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రిపోర్ట్ పంపారు. దాంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఎకరం రూ.100 కోట్లు పలికే స్థలాన్ని ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే డిపార్టుమెంట్ కి కేటాయించారు.రాష్ట్ర ఖజానాకు కూడా గండిపేట, శేరిలింగంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచే అత్యధికంగా ఆదాయం సమకూరుతుంది. అత్యధికంగా స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేసే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల జాబితాలో ఈ రెండు ముందు వరుసలో ఉంటాయి. అందుకే అంతే ఖరీదైన స్థలాన్ని ప్రభుత్వం అలాట్ చేయడం విశేషం. ఐతే రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో ఆదాయాన్ని సమకూరుస్తున్న పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కూడా కిరాయి ఇండ్లల్లోనే కొనసాగుతున్నాయి. చాలా కార్యాలయాలకు పార్కింగ్ సదుపాయం కూడా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటికి సొంత భవనాలు నిర్మించాలంటూ సబ్ రిజిస్ట్రార్ల సంఘం పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.















