ఈతరం భారతం రంగారెడ్డి జిల్లా ఫిబ్రవరి 11
షాద్ నగర్ పట్టణంలోని 15వ వార్డులో పోలింగ్ సందర్భంగా బిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు బాహాబాహీకి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరు పార్టీల మధ్య నెలకొన్న పరస్పర ఆరోపణలతో పోలింగ్ కేంద్రం వద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడింది.15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి భర్త సాదిక్ నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ బూతులోకి ప్రవేశించారని బిఆర్ఎస్ వర్గాలు ఆరోపించాయి. దీనికి ప్రతిగా, మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్ దౌర్జన్యంగా బూతులోకి వచ్చి తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలని ఓటర్లపై ఒత్తిడి తెస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి.పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరువురు మహిళా అభ్యర్థుల భర్తలను పోలింగ్ కేంద్రం నుండి బయటకు పంపించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి భర్త సాదిక్ స్వచ్ఛందంగా బయటకు రాగా, ప్రత్యర్థి వర్గాల ఉనికిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇరు వర్గాలు అక్కడే భీష్మించుకుని కూర్చున్నాయి. దీంతో పోలీసులు వారిని బలవంతంగా బయటకు పంపాల్సి వచ్చింది.మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్‌ను కొందుర్గు ఎస్సై రవీంద్ర నాయక్ బయటకు పంపించడంతో బిఆర్ఎస్ (టిఆర్ఎస్) కార్యకర్తలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పోలీసుల తీరును నిరసిస్తూ వారు నినాదాలు చేయడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.















