ఈతరం భారతం వరంగల్/నర్సంపేట: 5 డిసెంబర్ 2025
పేదవారి అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలోని నర్సంపేట లో హెలీపాడ్ కు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిలు చేరుకోగా, రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, అనసూయ సీతక్క, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ప్రభుత్వ విప్ రామ చంద్రునాయక్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం డి రియాజ్, ఎం పి బలరాం నాయక్, ఎమ్మెల్సీ లు బస్వరాజు సారయ్య , పింగిలి శ్రీపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, కె ఆర్ నాగరాజు, డాక్టర్ మురళి నాయక్, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, తదితరులు పుష్పగుచ్ఛాలు, పూల మొక్కలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శాలువాలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా నర్సంపేటలో రూ. 532.24 కోట్ల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు. అందులోరూ. 56.40 కోట్ల వ్యయంతో నర్సంపేట నుండి నెక్కొండ హెచ్ఎఎం రోడ్డు 2ఎల్ +పీఎస్ / 4ఎల్ లైన్ల రహదారికురూ. 82.56 కోట్లతో హనుమకొండ -నర్సంపేట- మహబూబాబాద్ హెచ్ఎఎం రోడ్డు నాలుగు లైన్ల రోడ్డుకు నర్సంపేటలో రూ. 26 కోట్లతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులకు,రూ.130 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల మరియు వసతి గృహముల నిర్మాణ పనులకు, రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణ పనులకు, నర్సంపేట పట్టణంలో రూ. 20.కోట్లతో అంతర్గత సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, బీటీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులకు,రూ.17.28 కోట్ల వ్యయంతో నర్సంపేట నుండి పాకాల హెచ్ఏఎం రోడ్డు 2ఎల్ +పీఎస్ లైన్ల పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. దీనితో నర్సంపేట కు విద్య, వైద్యం, రహదారి విస్తరణ వంటి ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగకరమైన రంగాలకు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రాధాన్యత లభించింది.
అనంతరం జరిగిన ప్రజా పాలన విజయోత్సవ వారోత్సవాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూరాష్ట్రంలో20 వేల కోట్ల రూపాయల తో ప్రతి గ్రామానికి రోడ్డు తాగునీరు, పాఠశాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ఎడ్యుకేషన్ ఇరిగేషన్ కమ్యూనికేషన్ కు ప్రాధాన్యత ఇస్తూ ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో కోటి 10 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని, రాష్ట్ర ప్రభుత్వం 3 కోట్ల 10 లక్షల మందికి సన్నబియ్యం ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రొఫెసర్ జయశంకర్‌ను స్ఫూర్తిగా తీసుకుని పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
సౌర విద్యుత్ ని ఉత్పత్తి చేసే బాధ్యతను మహిళలకు అప్పగించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయిన ఇందిరమ్మ చీరల పంపిణీ కోడ్ ముగిసిన వెంటనే 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు అందేలా స్వయంగా తానే బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. ఈ చీరలు గ్రామాల్లో మహిళలకు చేర్చే బాధ్యత మంత్రులు తీసుకోవాలని సూచించారు.వైఎస్ హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించి పేదవాళ్లకు ఇచ్చారని గుర్తు చేస్తూ… పేదల ఆత్మ గౌరవాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్లను పేదలకు అందిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.వచ్చే ఆర్థిక సంవత్సరం లో నర్సంపేట నియోజకవర్గంలో మరో 3500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. 60 వేలకుపైగా ఉద్యోగాల భర్తీతో పాటు ఇచ్చిన హామీలను ఇప్పటికే అమలు చేశామని తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్న సౌకర్యాలు, అభివృద్ధి అవకాశాలు వరంగల్‌కూ అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మార్చి 31 లోగా వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అలాగే వరంగల్‌లో అండర్ డ్రైనేజ్ వ్యవస్థ, ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించనున్నట్లు కూడా చెప్పారు.
రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి మాంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన హామీ మేరకు పేదవారి కోసం ముఖ్యమంత్రి గడిచిన 2 సం.లలో ప్రతిసంక్షేమ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారని అన్నారు. అభివృద్ధి లో రాష్ట్రాలతో కాకుండా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతున్నామని అన్నారు.అప్పుల కుంపటిలో ఉన్న రాష్ట్రం లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నమని తెలిపారు.పేదవారి ఆత్మగౌరవానికి చిహ్నం ఇందిరమ్మ ఇళ్లు ప్రతి నియోజకవర్గానికి 3 వేల 500 ఇండ్లు మంజూరు చేశామని అన్నారు. రాబోయే 3 సం. లో పేదవారికి విడతల వారిగా ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని తెలిపారు.
స్థానిక శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి సుమారు 1000 కోట్ల నిధులు కేటాయించిన నర్సంపేట పై వరాల జల్లు కురిపించడం పై ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపిన శాసనసభ్యులు నియోజక వర్గానికి నాణ్యమైన విద్యను వైద్యాన్ని అందించడానికి రూ.200 కోట్ల వ్యయం తో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్, తో పాటు రూ.154 కోట్ల తో మెడికల్ కళాశాల ను ఏర్పాటు చేయడం జరిగిందని కోట్లాది రూపాయలతో రోడ్ల విస్తరణ పనులు చేపడుతున్నామని తెలిపారు.















