2.4.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ నలుబోల మధులత, ఖమ్మం.
ఖమ్మంలో కమల వికాసం ధ్యేయంగా రెండు నెలలుగా క్షేత్ర స్థాయిలో క్యాడర్ ను బలోపేతం చేస్తున్న భారతీయ జనతా పార్టీ (బీ జే పీ) ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గం సమగ్ర పురోభివృద్ధి కోసం మినీ మ్యానిఫెస్టో తో కూడిన కరపత్రాన్ని మంగళవారం విడుదల చేసింది. సంఘ సేవకుడు, విద్యావంతుడు, వ్యాపారవేత్త, పలు స్వచ్ఛంద సంస్థలకు సేవలందించిన ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు గారు రాసిన లేఖ రూపంలో ఉన్న ఈ కరపత్రాన్ని పార్టీ సీనియర్ నాయకుల సమక్షంలో క్లస్టర్ ఇంచార్జ్ మార్తినేని ధర్మారావు విడుదల చేశారు. పార్టీ అభ్యర్థి వినోద్ రావు గారికి ఒక్క అవకాశం ఇస్తే జరిగే లాభాలు ఇందులో ఉన్నాయని అయన అన్నారు. “ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి గుమ్మం చెంతకు… మోడీ సందేశం-సర్వజన సంక్షేమం” అన్న శీర్షికతో ఉన్న కరపత్రాన్ని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఐ ఐ ఎం లకు చెందిన నిపుణుల బృందం జరిపిన ప్రాథమిక అధ్యయనం ఆధారంగా ఒక ప్రణాళిక సహితంగా రూపొందించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో ఖమ్మం దరిచేరకపోవడానికి కారణం ఇక్కడ బీజేపీ ఎంపీ లేకపోవడమేనని ఈ సందర్భంగా ధర్మారావు అన్నారు.
రైతులు, యువకులు, బడుగు-బలహీన వర్గాలు, గిరిజనుల శ్రేయస్సు, సంక్షేమం కోసం ఈ ప్రణాళిక రూపొందించినట్లు వినోద్ రావు గారు చెప్పారు. “చైతన్యవంతమైన ఈ గడ్డబిడ్డగా నన్ను బాధించే అంశాల్లో మన యువత భారీగా వలస పోవడం ఒకటి. విద్యావ్యవస్థను ఇండస్ట్రీతో అనుసంధించి ఉపాధి అవకాశాలు మెరుగుచేసేలా ఒక పథకాన్ని రూపొందిస్తున్నాం. ఈ ప్రాంతాన్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తల హబ్ గా నేను తీర్చిదిద్దగలను. ఇలాంటి అనేక అంశాలు ఇందులో ఉన్నాయి,” అని అయన చెప్పారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే ఈ మానిఫెస్టో ను తుచ తప్పక అమలుచేసే ప్రయత్నం చేస్తానని అయన హామీ ఇచ్చారు.
ప్రతి కార్యకర్తా ఈ కరపత్రాలను ప్రజల చెంతకు చేర్చి క్షేత్రస్థాయిలో చర్చ జరపాలని ఖమ్మం జిల్లా అధ్యక్షులు గల్లా సత్య నారాయణ పిలుపునిచ్చారు. పార్లమెంట్ ప్రభారీ నంబూరి రామలింగేశ్వర్ రావు గారు , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అసెంబ్లీ కన్వీనర్ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ,అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య గారు ,దొంగల సత్య నారాయణ గారు మరియు వివిధ మోర్చాల నాయకులు , కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.















