న్యూ ఢిల్లీ ఏప్రిల్ 10 (ఈతరం భారతం న్యూ స్);: భారత్లో యాపిల్ ఐఫోన్ల ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగినట్లు బ్లూమ్ బర్గ్ నివేదిక వెల్లడించింది. బుధవారం వెలువడిన ఈ నివేదికలోని వివరాల ప్రకారం.. 2023లో భారత్లో యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. ఆ ఏడాది సుమారు 14 బిలియన్ల డాలర్ల ఖరీదైన ఐఫోన్లను భారత్లో తయారు చేశారు. ఇది గతంతో పోల్చితే రెండింతలని అధికారులు చెబుతున్నారు.అయితే చైనాపై యాపిల్ కంపెనీ దృష్టి సారించకపోవడం వల్ల భారత్ లో యాపిల్ ఉత్పత్తి జోరు పెరిగినట్లు తెలుస్తోంది. మన దేశంలో సుమారు 14 శాతం యాపిల్ ఉత్పత్తులు జరుగుతున్నట్లు బ్లూమ్ బర్గ్ వెల్లడించింది. అంటే ప్రపంచవ్యాప్తంగా 7 యాపిల్ పరికరాలు ఉత్పత్తి అయితే అందులో ఒకటి భారత్లోనే తయారవుతుందన్నమాట. భారత్లో ఉత్పత్తి పెంచడం వల్ల ఇన్నాళ్లూ చైనాపై ఆధారపడ్డ యాపిల్ సంస్థ ఇప్పుడు ఆ దేశంపై తన అవసరాన్ని తగ్గించుకుంటోంది
.















