రీజినల్ నెట్వర్క్ ఇంఛార్జి, మధు శ్రీ నలుబోల, ఖమ్మం.
దేశంలో మోడీ ప్రభంజనం బలంగా ఉందనీ, తెలంగాణలో గెలిచే 12 సీట్లలో ఖమ్మం కూడా ఉందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ అభయ్ పాటిల్ చెప్పారు. ఖమ్మం పట్టణ శివార్లలో జరిగిన పార్లమెంటు బూత్ సమ్మేళనానికి అభయ్ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఖమ్మంలో ఈ సారి కమల వికాసం ఖాయమన్న ఒక్క మాట చెప్పడానికే ఇక్కడకు వచ్చినట్లు ఆయన చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన రెండున్నర వేల మంది బూత్ కార్యకర్తల చప్పట్ల మధ్య ఆయన ప్రసంగించారు.
అప్పటి ముఖ్యమంత్రి కే సీ ఆర్ ను, ఇప్పటి సీ ఎం రేవంత్ రెడ్డి ని కామారెడ్డిలో ఓడించిన కాటిపల్లి వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ – హైదరాబాద్ లో మాధవీలత తో పాటు ఖమ్మంలో వినోద్ రావు కూడా బీజేపీ విజేతల జాబితాలో ఉంటారని చెప్పారు. బూత్ కార్యకర్తలు తమ కోసం తాము రాజకీయాలు చేయాలని, పార్టీకి సేవ చేస్తున్నట్లు భావించకుండా కష్టపడాలని హితవు పలికారు. ఇప్పుడు కష్టపడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి అవకాశాలు వస్తాయని చెప్పారు. జనానికి ఎల్లప్పుడూ అండగా ఉంటే, ప్రజల మధ్యనే ఉంటే వారే ప్రేమతో ఆదరిస్తారని చెప్పారు. పార్టీ కార్యకర్తలు పెట్టిన భిక్షే తన ఎం ఎల్ ఏ పదవని చెప్పారు.
ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ప్రసంగిస్తూ-ప్రతి కార్యకర్త మోడీ సైనికుడిగా గట్టిగా పనిచేసి ఆయన కోరుకున్న 400 సీట్లలో ఖమ్మాన్ని చేర్చాలని కోరారు. వచ్చే 30 రోజులు ప్రతి కార్యకర్త శ్రమించి తనను ఆశీర్వదించాలని కోరారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ- కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుచేయడంలో ఘోరంగా విఫలమయిందని చెప్పారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ- మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. రైతుల ఉసురు ఆయనకు తగులుతుందని అన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు నాయకులు ఈ సందర్భంగా పార్టీలో చేరారు.ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామ లింగేశ్వర రావు అధ్యక్షత వహించిన ఈ విస్తృత కార్యకర్తల సమావేశంలో మార్తినేని ధర్మారావు (క్లస్టర్ ఇంచార్జ్), శ్రీకాంత్ (పార్లమెంట్ ప్రభారీ), కొండపల్లి శ్రీధర్ రెడ్డి (రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు), గల్లా సత్యనారాయణ (భాజపా ఖమ్మం జిల్లా అధ్యక్షులు), శ్యాం రాథోడ్ (కార్యదర్శి) రంగా కిరణ్ (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు) కూడా ప్రసంగించారు. అసెంబ్లీ కన్వీనర్లు, మోర్చాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.















