16.4.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.
నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. మంగళవారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో కలిసి నామినేషన్ ప్రక్రియపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 18 నుండి 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉన్నట్లు, ఈ నెల 21 న ఆదివారం మినహాయించి, మిగతా 7 రోజులు ఉదయం 11.00 గంటల నుండి మ. 3.00 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. నామినేషన్ వేయడానికి వచ్చు అభ్యర్థికి సంబంధించి 3 వాహనాలు మాత్రమే అనుమతించబడునని, మిగతా వాహనాలు 100 మీటర్ల దూరంలో ఉండాలని ఆయన అన్నారు. నూతన కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో నామినేషన్లు స్వీకరించనున్నట్లు, రిటర్నింగ్ అధికారి చాంబర్ లో ఒకేసారి ఐదుగురికి మాత్రమే అనుమతి ఉందని ఆయన తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఒక ప్రపోజర్, గుర్తింపు పొందని పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులకు 10 మంది ప్రపోజర్లు ఉండాలన్నారు. పోటీచేయు అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా ఓటు హక్కు కలిగి ఉండవచ్చని, ప్రపోజర్లు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటుహక్కు కలిగి ఉండాలని ఆయన అన్నారు. బ్యాలెట్ పేపర్ లో ముద్రణకు చిహ్నాలు ఎన్నికల సంఘం నుండి వస్తాయని, ఫోటోల విషయంలో అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ నెల 26న అదే ఛాంబర్ లో స్క్రూటిని ప్రక్రియ చేపట్టబడుతుందని ఆయన తెలిపారు. ఈ నెల 29, మధ్యాహ్నం 3.00 గంటల వరకు ఉపసంహరణ కు గడువు వున్నట్లు ఆయన అన్నారు. ఉపసంహరణ కు అభ్యర్థులకు కలెక్టరేట్ లో సహాయక కేంద్రాన్ని ఏర్పాటుచేసి, లేటెస్ట్ నామినేషన్ పత్రం ప్రింట్, అఫిడవిట్ పత్రాలను అందుబాటులో ఉంచినట్లు, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. నామినేషన్ ఫారం-2ఏ లో, అఫిడవిట్ ఫారం-26లో సమర్పించాలన్నారు. అఫిడవిట్ లో అన్ని కాలమ్ లు పూర్తి చేయాలన్నారు. అభ్యర్థులు ఎన్నికల ఖర్చు విషయమై తాజా బ్యాంక్ ఖాతాలు తెరవాలని, ఎన్నికల సంబంధ లావాదేవీలన్ని ఈ ఖాతా ద్వారానే జరపాలని ఆయన అన్నారు. ఎస్సి, ఎస్టీ అభ్యర్థులు అయితే, రూ. 12 వేల 5 వందలు, మిగతా అభ్యర్థులకు రూ. 25 వేలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. నామినేషన్ స్వీకరణ చెక్ లిస్ట్ అందజేసి, దాని ప్రకారం సిద్ధం చేసుకోవాలని ఆయన తెలిపారు. నామినేషన్ ప్రక్రియ అంతా సిసి టివి కెమెరాల నిఘా ఉంటుందని, ఎన్నికల సంఘానికి లైవ్ టెలికాస్ట్ అవుతుందని, ప్రతిదీ రికార్డ్ అవుతుందని ఆయన అన్నారు. ఈ నెల 17 న వ్యయ పరిశీలకులు, 23న సాధారణ, పోలీస్ పరిశీలకులు జిల్లాకు రానున్నట్లు ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు, ఎస్ఎస్టీ టీములు ఈ నెల 18 నుండి పనిచేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 102 కేసులు నమోదు అయినట్లు, 96 మద్యం కేసులు ఉన్నట్లు, రూ. 1.50 కోటి నగదు సీజ్ చేసినట్లు ఆయన అన్నారు. నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగానే నిఘాను పటిష్టం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు ఎన్నికల్లో ఎవరైనా ధన, మద్యం, ప్రలోభాలు, బెదిరింపులకు గురిచేస్తే సమాచారం ఇవ్వాలని పోలీస్ కమిషనర్ అన్నారు.
ఈ సమావేశంలో శిక్షణా సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, మిర్నల్ శ్రేష్ఠ, జిల్లా పౌరసంబంధాల అధికారి ఎం.ఏ. గౌస్, జిల్లా ఉపాధికల్పన అధికారి కె. శ్రీరామ్, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ రాంబాబు, మదన్ గోపాల్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.















