యాదాద్రి భువనగిరి మే 15 (ఈతరం భారతం న్యూ స్); : ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి, అప్పులు చేసి పంటలు పండిస్తే ప్రభుత్వం కోనుగోలు చేయక పోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మండిపడుతున్నారు. కండ్ల ముందే పంటలు పాడవుతున్నా పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన రైతులు ఆందోళన బాటపడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధిస్తూ, రోడ్లపై బైఠాయిస్తూ తమ నిరసనను తెలుపుతున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో అన్నదాతలు ఆందోళన బాటపట్టారు.నెల గడుస్తున్నా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తమ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో ఆగ్రహించిన రైతులు, బుధవారం బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలో హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిని దిగ్బంధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. గంట పాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.















