జీ-20 సదస్సు- పర్యావరణ దార్శనికత
(2023 సెప్టెంబర్ 9-10 తేదీలలో న్యూడిల్లీలో జరిగిన జీ-20 దేశాల శిఖరాగ్రసమావేశం సందర్భంగా)

జీ-20 ( గ్రూప్ ఆఫ్ ట్వంటీ ) దేశాల కూటమి 18వ శిఖరాగ్ర సమావేశం భారత్ అధ్యక్షతన ఈ నెల 9-10 తేదీలలో భారత్ మండపం ప్రగతిమైదాన్న్యూ డిల్లీలోజరిగింది. మనకు స్వాతంత్ర్యం సిద్దించి 75 సంవత్సరాల అనంతరం ఒక శక్తివంతమైన అంతర్జాతీయ కూటమికి మనదేశం అధ్యక్షత వహించడం గొప్ప విశేషం. జీ-20 ప్రసిడెన్సీ భారతదేశం యొక్క అమృత్ కాలము (2022-2047) ప్రారంభాన్ని కూడా తెలియజేస్తున్నది. 1990 చివరలో తూర్పు ఆసియా మరియు ఆగ్నేయాసియా దేశాలలో తలెత్తిన ఆర్థికసంక్షోభం నేపధ్యంలో పరస్పర ఆర్థికసహకారం కొరకు 19 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ కలిసి 1999 లో జీ-20 దేశాల కూటమిఏర్పడింది. కాలక్రమంలో ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా ఎజెండా అంశాలలో మార్పులు చోటుచేసుకున్నాయి. గత సంవత్సరం 17వ జీ-20 దేశాల సదస్సు బాలి (ఇండోనేషియా) లో రికవర్ టుగెదర్–రికవర్ స్ట్రాంగర్ అనే నినాదంతో జరిగింది .ఈ సంవత్సరం మన ప్రాచీన సంస్కృతగ్రంధమైన మహాఉపనిషత్తుల నుండి గ్రహించబడిన “వసుదైక కుటుంబం“ ( గ్లోబల్ ఫ్యామిలీ ) అనే తాత్వికఆలోచనను రూపొందించడానికి వన్ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అనే ప్రధాన ఇతివృత్తంతో జీ-20 సమావేశం విజయవంతమైంది. ప్రపంచ ఐక్యతాసందేశాన్ని అందించే ఈ ఇతివృత్తం పరిపూర్ణమైనది. ఈ థీమ్ మానవ జంతు వృక్ష సూక్ష్మజీవుల విలువలను మరియు భూమితో సహ విశ్వవ్యాప్తంగా వాటి పరస్పర అనుసందానాన్ని తెలియజేస్తున్నది. వచ్చే సంవత్సరం (2024) లో 19వ జీ -20 దేశాల సదస్సు రియోడిజనిరో ( బ్రెజిల్ ) లో జరుగనుంది. ప్రతి సంవత్సరం ఒక సభ్యదేశం అధ్యక్షతన జరిగే జీ-20 దేశాలసమావేశాలు తమ ఎజెండాలో ఆర్థికాంశాలతో పాటు పలు పర్యావరణపరిరక్షణ, వాతావరణమార్పు అంశాలకు పెద్దపీట వేస్తుండటం ఆహ్వానించదగిన పరిణామంగా చెప్పుకోవాలి.
జీ-20 పర్యావరణమంత్రాంగం: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన జీ-20 దేశాలు జనాభాలో మూడింట రెండు వంతుల, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జీడీపీలో 85 శాతం వాటా కలిగి ఉన్నాయి . 21 వ శతాబ్దపు ప్రపంచ సవాళ్ళతో పాటు పర్యావరణసవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని పరిష్కారమార్గాలను కనుగొనేందుకు జీ-20 సమావేశాలు నిరంతరం కృషి సలుపుతునే ఉన్నాయి . 2022వ సంవత్సరం ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జీ-20 సమావేశం 2015 నాటి పారిస్ ఒప్పందాన్ని అమలుచేయాలని పునరుద్ధ్ఘాటించింది. ఈ శతాబ్దం చివరినాటికి ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదల రేటు 1.5 సెల్సియస్ డిగ్రీలకు పరిమితం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు ఆ సదస్సు ప్రకటించింది. కోవిడ్ -19 నివారణ, సంసిద్దత, ప్రతిస్పందనల కోసం వరల్డ్ బ్యాంక్ ప్రారంభించిన పాండమిక్ ఫండ్ అనే కొత్త ఆర్థిక మధ్యవర్తినిధిని కూటమి స్వాగతించింది. ఈ సంవత్సరం (2023) మనదేశంలో జరిగిన జీ-20 శిఖరాగ్రసమావేశాల్లో * హరిత అభివృద్ది, వాతావరణ ఆర్థికనిధి, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ ( లైఫ్ ) * సుస్థిరాభివృద్ది లక్ష్యాల సాధనపై పురోగతిని వేగవంతం చేయడం * వేగవంతమైన నిలుపుదల గల స్థితిస్థాపకవృద్ది * సాంకేతిక పరివర్తన మరియు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్* 21వశతాబ్దానికి బాహుపాక్షికసంస్థలు–మహిళల నేతృత్వంలో అభివృద్ది అను 6 ప్రాధాన్యతాంశాలు ఎజెండాఅంశాలుగా ఉన్నాయి. ఇందులో భాగంగా గడిచిన సంవత్సరకాలంగా అధికారులుదౌత్యవేత్తలు వ్యాపారవేత్తలు ఎన్జిఓలు వర్కింగ్ గ్రూపులు మరియు మంత్రుల స్థాయిలో 60 నగరాల్లో జరిగిన 220 లకు పైగా సన్నాహక సమావేశాలను ఆత్మీయఆతిథ్యములో ఫలవంతమైన చర్చలతో ప్రపంచ దేశాలకు మార్గనిర్దేశనం చేయడంలో భారత్ ముందుంది . పర్యావరణ పరిరక్షణ గురించి మే 21-23 తేదీలలో ముంబై లో జరిగిన జీ-20 దేశాల ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ సస్టేనబిలిటీ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో నీలి ఆర్థిక వ్యవస్థ, సముద్రవనరుల పరిరక్షణ మరియు సముద్ర జీవవైవిధ్యంల సుస్థిర నిర్వహణ అంశాల గురించి చర్చించారు .జూన్ 16-17 తేదీలలో హైదరాబాద్ లో జరిగిన వ్యవసాయ మంత్రుల సమావేశంలో ఆహారభద్రత, పౌష్టికాహారం గురించి చర్చించారు. 26-28 జులై లో చెన్నైలో జరిగిన జీ-20 దేశాల పర్యావరణ మంత్రుల సమావేశంలో భూమిక్షీణత నివారణ, జీవవైవిధ్యపెంపు, ఆవరణపునరుద్దరణ, వాతావరణసుస్థిరత, నీలి మరియు వృత్తాకార ఆర్థికవ్యవస్థలు తదితర అంశాల గురించి విస్తృతంగా చర్చలు జరిగాయి.
న్యూడిల్లీలో ఈ నెల 9-10 తేదీలలో జరిగిన 18 వ శిఖరాగ్రసమావేశంలో ఎజెండా అంశాల గురించి విస్తృతంగా చర్చించి విధాన కార్యాచరణ నిర్ణయాలను ఏకగ్రీవంగా ఆమోదించి 37 పేజీలు, 87 పేరాలు గల న్యూడిల్లీడిక్లరేషన్ను ఆవిష్కరించారు. డిల్లీ డిక్లరేషన్ అనేది ప్రపంచ దేశాల భవిష్యత్ కోసం, మరింత స్థిరమైన సమానమైన సంపన్నమైన ప్రపంచాన్ని నిర్మించడానికి అన్నీ దేశాలు కలిసి పనిచేయడానికి ఒక ఉమ్మడి పిలుపు. భూగోళ పర్యావరణ పరిరక్షణ దిశగా “ భూమి-ప్రజలు–శాంతి–శ్రేయస్సు “ (ప్లానేట్, పీపుల్, పీస్, ప్రాస్పరిటీ – పి4) అనే శీర్షికతో 8 పేరాలలో జియోపొలిటికల్ అంశాలు ఉన్నాయి. ఈ అన్నీ అంశాలపై సదస్సు ఏకాభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ప్రపంచ దేశాలన్నీ 2030 నాటికి గ్రీన్ హౌజ్వాయువుల ఉద్ఘారాలను 43 శాతం తగ్గించడానికి కట్టుబడి ఉండాలని , భూతాపం కట్టడికి 5.8-5.9 ట్రిలియన్ల అమెరికన్ డాలర్లు అవసరమని , 2050 నాటికి శూన్య నికరకర్బన ఉద్ఘారాలను సాధించే దిశగా పనిచేయాలని, క్లీన్ఎనర్జీ టెక్నాలజీ కొరకు ప్రతి సంవత్సరం 4 ట్రిలియన్ల అమెరికన్ డాలర్లు అవసరమని డిక్లరేషన్ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా సుస్థిరమైన జీవఇంధనాల వినియోగాన్ని పెంచడానికి గ్లోబల్ బయోఫ్యూయెల్ అలయెన్స్ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ కలపాలని తద్వారా కర్బన ఉద్ఘారాలను తగ్గించవచ్చునని, కృత్రిమమేధ వల్ల తలెత్తే రిస్క్ లను నివారించేందుకు దేశాలన్నీ ప్రొ ఇన్నోవేషన్ రెగ్యులేషన్ గవర్నెన్స్ విధానాన్ని అవలంభించాలని జీ 20 దేశాలు తమ డిక్లరేషన్ లో నిర్ణయించాయి. సుస్థిర భవిష్యత్తు కొరకు హరిత ఒప్పందంను స్వాగతించింది . భూమి దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం ప్రకృతితో సామరస్య జీవనం కోసం, స్వచ్చమైన పచ్చదనంతో కూడిన మరియు నీలిరంగు భవిష్యత్తును సాధించే లక్ష్యంతో గ్లాస్గో సదస్సు (2021) లో మనదేశం “ పర్యావరణం కోసం జీవనశైలి “(Lifestyle For Environment –LiFE) అనే ప్రపంచస్థాయి పర్యావరణ ప్రజాఉద్యమ ఆలోచనకు అంకురార్పణ చేయడం మరియు ఈ ప్రోగ్రామ్ లక్ష్యాల కార్యాచరణ సాధనకు జీ-20 సదస్సులో ఎజెండా అంశంగా చేర్చడం అనేది ప్రపంచ పర్యావరణరంగంలో కీలకమలుపుగా పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
వాతావరణన్యాయంతో మేలు : నేడు ప్రపంచం వాతావరణవిపత్తుల వైపు పరిగెడుతోంది. కనుక పర్యావరణ వ్యవస్థలు, జీవవైవిధ్యం నాశనం అవుతున్నందున ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా పర్యావరణ సుస్థిరాభివృద్ది లక్ష్యాల సాధనలో మనమిప్పుడు మధ్యకాలంలో ఉన్నాం. ఈ లక్ష్యాల ప్రగతిని వేగిరవంతం చేయడంపై జీ-20 కూటమి సమావేశం యొక్క న్యూడిల్లీ డిక్లరేషన్ కార్యాచరణ ప్రాణాళిక అన్నీ దేశాలను ఉజ్జ్వల భవిష్యత్తు వైపు పయనింపజేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ కార్యాచరణకనుగుణంగా జీ-20 దేశాలు పలు వాతావరణసంరక్షణ చర్యలను చేపట్టాలి. పర్యావరణం, వాతావరణం పరిశీలన కోసం భారత్ ప్రతిపాదించిన జీ-20 శాటిలైట్ మిషన్ ప్రారంభానికి సత్వర చర్యలు తీసుకోవాలి. ఆహారం, ఇంధన నిర్వహణ, సైబర్ భద్రత, భవిష్యత్ తరాల ఆరోగ్యం, నీటి భద్రత సమస్యలకు గట్టి పరిష్కారాన్ని కనుగొనాలి. 2030 నాటికి భూభాగం, సముద్రాలలో కనీసం 30 శాతాన్ని పూర్తి స్థాయిలో పరిరక్షించేందుకు 30 బై 30 ప్రణాళికను అమలు పరచాలి .ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతమొందించాలి. 21 వ శతాబ్దపు వాతావరణ సవాళ్లను దృష్టిలో పెట్టుకొని సమ్మిళిత శక్తి పరివర్తన కోసం అభివృద్ది చెందిన దేశాలు పాటుపడాలి. వాతావరణ మార్పుల దుష్ప్రభావంతో ఎక్కువ నష్టపోయే పేద బలహీన దేశాల ప్రజలకు తగు చేయూత నిచ్చేవిధంగా అత్యధిక కర్బన ఉద్ఘారిత సంపన్న దేశాలు సత్వరంగా వాతావరణ ఆర్థికనిధిని ఏర్పాటు చేసి వారికి తగు వాతావరణ న్యాయం ( క్లైమేట్ జస్టిస్ ) జరిగేలా జీ-20 దేశాలు మరింత పర్యావరణ దార్శనికత కలిగి నిబద్దతతో మెరుగైన భవిష్యత్తు కోసం కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది .
– వ్యాసరచయిత : డాక్టర్ భారత రవీందర్ ( 9912536316 )
(సైన్స్ రచయిత & ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్)















