బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి హేయనీయం
పట్టపగలే ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి హత్యాయత్నానికి పాల్పడటమే ఇందిరమ్మ రాజ్యమా!
తీవ్రంగా ఖండించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
హైదరాబాద్ సెప్టెంబర్ 12 (ఈతరం భారతం);: బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయటాన్ని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్రంగా ఖండించారు. పట్టపగలే ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి హత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారంటే రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచి పోలీసుల సాయంతో అరికెపూడి గాంధీ గుండాలు రెచ్చిపోయి దాడులకు పాల్పడటమేమిటన్నారు. రాష్ట్రాన్ని ఫ్యాక్షనిజం, రౌడీయిజానికి అడ్డాగా మార్చేస్తుండటం చూస్తుంటే బాధేస్తుందన్నారు. ఇది కచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించిన దాడేనని కెటిఆర్ ఆరోపణలు చేశారు.గత కొన్ని రోజులుగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై న్యాయపోరాటం చేస్తున్న కౌశిక్ రెడ్డిని ఈ ప్రభుత్వం టార్గెట్ చేసిందన్నారు. కావాలనే తనపై అక్రమ కేసులు, హత్యాయత్నాలకు పాల్పడి బెదిరించే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఉడుత ఊపులకు బిఆర్ఎస్ బెదరదని కెటిఆర్ స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర చేస్తున్నారని ఆయనకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.















