భారత రాజకీయాల్లో అత్యంత గౌరవ నీయమైన వ్యక్తి సీతారాం ఏచూరి
12.09.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.
ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో ఢిల్లీ ఎయిమ్స్ కొద్ది వారాలుగా చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త, కాలమిస్ట్ గా గుర్తింపు పొందిన ఏచూరి.. 1992 నుంచి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.
సీతారాం ఏచూరి మద్రాస్ (ప్రస్తుతం చెన్నై)లో తెలుగు కుటుంబంలో 12 ఆగస్టు 1952న జన్మించారు. ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజుల ఏచూరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ కార్పొరేషన్ లో ఇంజినీర్. తల్లి కల్పకం ఏచూరి ప్రభుత్వ అధికారి. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ మోహన్ కందాకు మేనల్లుడు. ఏచూరి బాల్యం హైదరాబాద్ లోనే గడిచింది. ఇక్కడి ఆల్ సెయింట్స్ హైస్కూల్లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీకి వెళ్లి ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో చేరారు. 1970లో సీబీఎస్సీ హయ్యర్ సెకండరీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకర్ గా నిలిచారు. ప్రఖ్యాత సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో బీఏ పూర్తి చేశారు. జేఎన్ యూ నుంచి ఎంఏ పట్టా పొందారు. అక్కడే పీ హెచ్ డీ లో చేరినా.. ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు కావడంతో దాన్ని కొనసాగించలేకపోయారు. సీతారాం మొదటి భార్య ఇంద్రాణి మజుందార్. జర్నలిస్టు సీమా చిశ్తీని రెండో వివాహం చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం.ఎస్ఎఫ్ఎ విద్యార్థి నేతగా 1974లో సీతారాం ఏచూరి రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1975లో జేఎన్ యూ విద్యార్థిగా ఉన్నప్పుడు సీపీఎంలో చేరారు. ఎమర్జెన్సీ సమయంలో అరెస్టయిన వారిలో ఆయన కూడా ఒకరు. జేఎన్ యూ స్టూడెంట్స్ యూనియన్ కు మూడుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరాత్తో కలిసి జేఎన్ యూను వామపక్ష కోటగా మార్చారు. ఎస్ఎఫ్ఎ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. 1984లో సీపీఎం కేంద్ర కమిటీలో చేరారు. 1992లో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2005లో పశ్చిమ బెంగాల్ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015లో విశాఖపట్నంలో జరిగిన 21వ సీపీఎం మహాసభల్లో పార్టీ ఐదో ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు.















