వార్ రూమ్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆదివారం ఉదయం సమావేశం అయ్యారు. తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో ఈ భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, స్క్రీనింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రెండో విడత అభ్యర్థులపై మరోసారి కసరత్తును ప్రారంభించారు. నిన్న (శనివారం) దాదాపు 6 గంటల పాటు నేతలు సమావేశమయ్యారు. అయినా టికెట్ల పంచాయితీ కొలిక్కిరాలేదు. దీంతో మళ్లీ ఈరోజు భేటీ అయ్యారు. 26వ తేదీలోగా అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించనుంది.
కాగా బీసీ అభ్యర్థులకు బీఆర్ఎస్ కంటే ఎక్కువ స్థానాలు కేటాయించి.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్రావు ఠాక్రే చెప్పారు. బీసీలతో పాటు అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమని చెప్పారు. తదుపరి జాబితా కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు అంశంపై శనివారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఆరు గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో తెలంగాణ స్ర్కీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్రావు ఠాక్రే, ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మాణిక్రావు ఠాక్రే విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం తర్వాతే రెండో జాబితా ప్రకటిస్తామని, సీఈసీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు తాము హాజరవుతామన్నారు. సీఈసీ భేటీ తర్వాతే ఫైనల్ లిస్ట్ వస్తుందని చెప్పారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని సమీక్షించామన్నారు. ఏ నియోజకవర్గంపై చర్చ అవసరం అనుకుంటే దానిపై స్ర్కీనింగ్ కమిటీ చైర్మన్ సంబంధిత నేతలను పిలిచి మాట్లాడతారని అన్నారు. ఒక నియోజకవర్గంలో ఒక్కరే పోటీచేస్తారు కాబట్టి మిగతావారు అర్థం చేసుకుని సహకరించాలని చెప్పారు. అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వారంతా కట్టుబడి ఉంటారని.. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులు, ఆశావహులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో రాహుల్ బస్సు యాత్రపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి పదేళ్లయినా ఇచ్చిన హామీలు పూర్తి చేయలేదు కాబట్టి.. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని మాణిక్రావ్ ఠాక్రే ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీకి ఎంత మంది అభ్యర్థులు ఉన్నారో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వామపక్ష పార్టీలతో పొత్తులపై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు.















