EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సీఎం సభకు రంగం సిద్ధం..   అన్ని హంగులతో ఏర్పాట్లు పూర్తి

ఈతరంభారతం సూర్యాపేట జూలై 13 :ఈ నెల 14న సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.సభలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరుగనున్నది. సభా ఏర్పాట్లను కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఎస్పీ నరసింహులు, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్, ఇతర జిల్లా అధికారులు సమీక్షించి వేదిక, ట్రాఫిక్, వీఐపీ పార్కింగ్, భద్రత తదితర ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

పౌర సరఫరాల శాఖ కమిషనర్ చౌహన్ తెలిపిన వివరాల ప్రకారం, ఉమ్మడి జిల్లాల్లో 1.18 లక్షల దరఖాస్తులు రాగా, ఇప్పటికే 89,000కు పైగా రేషన్ కార్డులు మంజూరు అయ్యాయి. 14న తుంగతుర్తి గడ్డపై ఒక్కో మండలానికి ఇద్దరికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా రేషన్ కార్డులు అందజేయనున్నారు. సభ ప్రాంగణం, పార్కింగ్, హెలిప్యాడ్‌ల ఏర్పాట్లు 35 ఎకరాల విస్తీర్ణంలో పూర్తయ్యాయి. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ తదితరులు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. రేషన్ కార్డుల పంపిణీతో పాటు, ఇది రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా కార్యక్రమం జరగాలని వారు ఆకాంక్షించారు. ప్రజలు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.సభా ఏర్పాట్లలో విద్యుత్ సరఫరా నిరంతరం కొనసాగేలా చూడాలని, భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. మీడియా కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేసి వసతులు కల్పించాలని డీపీఆర్‌వోకు సూచించారు. కళాకారుల కార్యక్రమాల కోసం ఏర్పాట్లు, సౌండ్ సిస్టమ్, సీసీ కెమెరాలు, లైటింగ్, శానిటేషన్ తదితర అంశాలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. రాంబాబు, జడ్పీ సీఈఓ అప్పారావు, డీఎఫ్ఓ సతీష్ కుమార్, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top