ఖమ్మం ఆగస్టు 26 ఈ తరంభారతం :భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (డిఎస్ఎఫ్ఐ), ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలో అనుమతులు లేకుండా ఇంటర్మీడియట్ తరగతులు నిర్వహిస్తున్న అకాడమీలపై చర్యలు తీసుకోవాలని స్థానిక బ్యాంకు కాలనీ డిఎమ్ జూనియర్ కళాశాల ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేసారు, కాసేపు విద్యార్థి సంఘ నాయకులకు అకాడమీ యాజమాన్యాలకు మధ్య వాగ్వాదా నెలకొంది. ఈ సందర్భంగా డిఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి మాళోత్ శాంతి కుమార్, రాష్ట్ర అధ్యక్షులు బి.వీరభద్రం, రాష్ట్ర కోశాధికారి గుగులోత్ సూర్య ప్రకాష్ మాట్లాడుతూ ఖమ్మం పట్టణంలో అనేక నీట్ కోచింగ్ సెంటర్లు వేరు వేరు అకాడమీల పేరుతో నిర్వహిస్తూ లక్షల రూపాయల ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూళ్ళు చేస్తున్నారనీ, ఆయా కోచింగ్ సెంటర్లపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన కోచింగ్ సెంటర్ల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్రమైన ఒత్తిడులకు గురిచేస్తూ ఫీజులు చెల్లించాలని జలగల్లాగా పట్టి పీడిస్తున్నారనీ, ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా కొన్ని అకాడమీలు ఇతర కళాశాలల పేరుతో ఇంటర్మీడియట్ అడ్మిషన్లు చేసి బాహ్యాటంగా ఇంటర్మీడియట్ తరగతులు నిర్వహిస్తున్నారని, అకాడమీలలో నీట్ కోచింగ్ పొందే విద్యార్థులలో మొదటి, రెండవ సంవత్సరం చదువుతున్న వారే ఎక్కువ అనీ, అక్కడ కోచింగ్ పొందే విద్యార్థులకు తాము ఏ కళాశాలలో ఇంటర్మీడియట్ అడ్మిషన్ పొందారో తెలియదనీ, కనీసం తమ కళాశాల పేరేంటో తెలియదనీ, అడ్మిషన్ల చేర్పింపు సమయంలో తమకు అన్ని రకాల అనుమతులు ఉన్నట్లు నమ్మబలికి చివరికి ఏదో ఓ కళాశాల పేరుతో అడ్మిషన్ చేస్తారనీ, విద్యార్థులను, తమ తల్లిదండ్రులను మోసగించే ఇటువంటి చర్యలు ఎలా చట్టబద్దమైనవో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులే సమాధానం చెప్పాలని కోరారు. లాంగ్ టర్మ్ , షార్ట్ టర్మ్, క్రాష్ కోర్స్, లియో, ఎయిమ్స్ , జిప్మర్, నీట్ 20 స్పెషల్ ఫోకస్డ్ బ్యాచ్ పేరుతో, టాప్ మార్కులు, సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్, ట్రిపుల్ డిజిట్ ర్యాంకుల పేరుతో తల్లిదండ్రులను ప్రైవేట్, కార్పోరేట్ మాయాజాలంలోకి దింపి లక్షల రూపాయలు వసూళ్ళు చేస్తున్నారన్నారని వారు ఆరోపించారు.ఖమ్మం పట్టణంలో శ్రీచైతన్య, నారాయణ, డాక్టర్స్ మెడికల్ అకాడమీ, ఎలైట్ మెడికల్ అకాడమీ, ఆకాష్, శ్రీ వైవిధ్య మెడికల్ అకాడమీ, ప్రజ్ఞ, ఫిజిక్స్ వాలా, పిటిఆర్ ఆర్యభట్ట, రైట్ వే కోచింగ్ సెంటర్లు విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడి చేస్తున్నాయన్నారు. తక్షణమే అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇంటర్మీడియట్ తరగతులు నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లపై, ఈ వ్యవహారంలో భాగమైన కళాశాలలపై జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి తగు చర్యలు తీసుకోవాలనీ, కోర్సు పూర్తైనా విద్యార్థుల సర్టిఫికెట్స్ ఇవ్వకుండా, డబ్బులు చెల్లిస్తేనే సర్టిఫికెట్స్ ఇస్తామని విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా కోచింగ్ సెంటర్లలో చదివే విద్యార్థులు కొందరు ప్రభుత్వం ఇచ్చే ఉపకారవేతనాలకు దూరమవుతున్నారనీ, కొందరి విద్యార్థుల ఉపకార వేతనాలు అడ్మిషన్ ఇచ్చిన కళాశాలలే లాగేసుకుంటున్నాయనీ, తక్షణమే జిల్లా కలెక్టర్, ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి స్పందించి తప్పుడు పద్దతుల్లో నిర్వహిస్తున్న అకాడమీలపై, ఇంటర్మీడియట్ కళాశాలలపై తగు చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు తల్లిదండ్రులకు తగు న్యాయం చేయాలని, అధిక మొత్తంలో ఫీజుల వసూళ్ళు నియంత్రించాలని, కోచింగ్ సెంటర్లకు ప్రతీ యేటా జిల్లా కలెక్టర్ స్థాయిలో నిర్ణీత ఫీజు నిర్ణయించాలని భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య ( డిఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ఐ సిహెచ్ రామ్ చరణ్, ఎర్ర దిలీప్, ఖమ్మం పట్టణ ఇన్ చార్జి హరిచందర్, పెరుమండ్లపల్లి సిద్ధార్థ, మన్నె రాజేష్, గోపి, రాము , వెంకీ, సాయి, కౌశిక్, సుజల్ తదితరులు పాల్గొన్నారు.















