బీసీ అభ్యర్థిని సీఎంగా ప్రకటించిన పార్టీకే బీసీల సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాజుల మాట్లాడుతూ సీఎం పదవి బీసీలకు ఇవ్వాలని పోరాటం చేస్తున్నామని అన్నారు. జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు 60 అసెంబ్లీ సీట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీలకే సీఎం పీఠం ఇస్తామని అమిత్ షా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని, పీఎం మోడీ, అమిత్ షా కి ధన్యవాదాలు తెలిపారు. బీసీలను కేవలం జెండాలు మోయడానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆరెస్ బీసీలకు 23 టికెట్స్ మాత్రమే ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ డొంకతిరుగుడు మాటలు చెప్పి 34 టికెట్స్ ఇస్తామని చెప్పి 20 మాత్రమే టికెట్స్ ఇచ్చిందన్నారు. బీజేపీ ప్రకటించిన జాబితాలో బీసీలకు 36 శాతం ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. బీసీల తలరాతలు మారాలంటే బీసీ సీఎం కావాలన్నారు. రాజ్యాధికారం ఎజెండాతో ముందుకెళ్తున్నామని చెప్పారు. బీఆరెస్ పార్టీకి దమ్ముంటే బీసీని సీఎం చేయాలన్నారు. బీఆరెస్ పార్టీ అధ్యక్ష, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు కూడా బీసీ లకు ఇవ్వలేదన్నారు. డిప్యూటీ సీఎం పదవి కూడా బీసీలకు ఇవ్వలేదన్నారు. అర శాతం ఉన్న వారు సీఎంగా ఉంటున్నారని అన్నారు. బీఆరెస్ బీసీ వ్యతిరేక పార్టీ అని, బీజేపీని బీసీలు విశ్వసిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో కుందారం గణేష్ చారి, సింగం నగేష్ గౌడ్, దుర్గయ్య గౌడ్, విక్రమ్ గౌడ్, మహేశ్ యాదవ్, శ్యామల, దేవిక, ఇంద్రం, జంగయ్య యాదవ్, గూడూరు భాస్కర్, రాజేష్, సాయి తేజ, అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.