హైద్రాబాద్, అక్టోబర్ 31 ( ఈతరం ఇండియా న్యూస్ ) : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణానికి చెందిన తిరునగరి శ్రీనివాస్ హైద్రాబాద్‌లో మంగళవారం జరిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం 83వ స్నాతకోత్సవంలో డాక్టరేట్ డిగ్రీని అందుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన స్నాతకోత్సవానికి విశ్వవిద్యాలయ ఛాన్సలర్, తెలంగాణ రాష్ర్ట గవర్నర్ తమళసైసౌందరరాజన్ హాజరయ్యారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, అమెరికాలోని అడోబ్ ఐఎన్సి ముఖ్య కార్యనిర్వాహణాధికారి శంతను నారాయణ్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి రవీందర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమంలో డాక్టరేట్ డిగ్రీని శ్రీనివాస్ స్వీకరించారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యంపై సమగ్ర అధ్యయనంతో కూడిన సినారె కవిత్వంలో ప్రయోగాలు – ప్రతీకలు అన్న అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ ఎన్ఆర్ వెంకటేశం పర్యవేక్షణలో శ్రీనివాస్ పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించినందుకు ఈ డాక్టరేట్ డిగ్రీ ఆయనకు లభించింది. స్నాతకోత్సవంలో డాక్టరేట్ డిగ్రీని అందుకున్న శ్రీనివాస్‌కు విద్యా, సాహిత్య, సాంస్కృతిక సేవా రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
















