హైదరాబాద్ అక్టోబర్ 7 (ఈ తరంభారతం);బిజెపి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మహర్షి వాల్మీకి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆయన స్ఫూర్తిదాయక జీవితాన్ని స్మరించుకున్నారు. మానవ సమాజానికి సత్యం, ధర్మం, న్యాయం, నైతికత మార్గాలను చూపిన మహర్షి వాల్మీకి బోధనలు అందరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ గారు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతికిరణ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మాట్లాడుతూ వాస్తవానికి వాల్మీకి సమాజం వెనుకబడిన తరగతులలో భాగంగా ఉంది. అయితే వాల్మీకి సమాజాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది.టీవల గద్వాల ప్రాంతంలో బోయ వాల్మీకి సోదరులు నన్ను కలిసి తమ సమస్యలను వివరించారు. వారికి ఎమ్మార్వో ఆఫీసుల్లో కనీసం కుల ధృవపత్రాలు కూడా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాల్మీకి సమాజం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం అన్యాయం.ఇప్పటికైనా వాల్మీకి బోయల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టి సారించాలి. రాష్ట్ర ప్రభుత్వం పదేపదే బీసీలకు, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటోందని కానీ వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాలు, గురుకుల విద్యాసంస్థలు తీవ్రమైన ఇబ్బందుల్లో నడుస్తున్నాయి.ప్రస్తుతం దాదాపు 6 లక్షల 70 వేల మంది విద్యార్థులు గురుకులాల విద్యాలయాల్లో చదువుతున్నారు. కానీ వారికీ తినడానికి సరైన భోజనం లేదు, సురక్షితమైన భవనాలు లేవు. రాష్ట్రంలో ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలు, గురుకులాలు సొంత భవనాల్లేక అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో యజమానులు భవనాలకు తాళాలు వేస్తున్నారు.ఫలితంగా విద్యార్థులు నాసిరకం భోజనం, పాక్షిక ఆహారం లేదా ఆహార లోపంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.మరికొన్ని చోట్ల శిథిలావస్థకు చేరిన గురుకులాల భవనాలకు మరమ్మతులు చేపట్టడం లేదు.కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక వర్గాల విద్యార్థుల కోసం గురుకులాల్లో అన్ని వసతులు కల్పించేందుకు తగిన నిధులు విడుదల చేయాలి. అన్ని వసతి గృహాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చాలన్నారు.















