ఈతరం భారతం ఖమ్మం నవంబర్ 17:
పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి ప్రత్యేక చొరవతో నాగులవంచ రైల్వేస్టేషన్ లో ప్రయాణికుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలు సమకూరాయి. ఈ ప్రాంతం నుంచి తరచూ.. మధిర, ఖమ్మం, కొండపల్లి, విజయవాడ, హైదరాబాద్ లకు వివిధ పనుల మీద ప్రజలు, ఉన్నత విద్య కోసం విద్యార్థులు వెళుతుంటారని.. కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని ఎంపీ రఘురాం రెడ్డి రైల్వే జీఎం దృష్టికి గతంలో తీసుకెళ్లారు. నిజాం కాలం నాటి ఈ రైల్వే స్టేషన్ లో సౌకర్యాలు కల్పించాలని, పలు సర్వీసులను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో స్పందించిన రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ హుటాహుటిన పనులు చేయించారు.
స్టేషన్ లో అదనంగా లైట్లు, బెంచీల ఏర్పాటు
మూడో లైన్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పుడున్న బెంచీలకు అదనంగా ప్లాట్ ఫామ్ -1 వద్ద పనులు చేపట్టినట్లు రైల్వే జీఎం తెలిపారు. స్టేషన్ భవనాన్ని ఆధునికీకరించామని, బుకింగ్ కౌంటర్ లో ఎల్ఈడి లైట్, ఒకటో ప్లాట్ ఫార్మ్ వెంట 14 లైట్లు, సీలింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
విజయవాడ-డోర్నకల్ సర్వీస్ కు హాల్ట్ సౌకర్యం
ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి విజ్ఞప్తి మేరకు.. నాగులవంచ రైల్వే స్టేషన్ లో విజయవాడ- డోర్నకల్ ప్యాసింజర్ రైలుకు హాల్ట్ సౌకర్యం కల్పించినట్లు జీఎం తెలిపారు. గత నెల 25వ తేదీ నుంచే ఇది అమలవుతున్నట్లు పేర్కొన్నారు.
ఎంపీ రఘురాం రెడ్డికి రైల్వే ప్రయాణికుల కృతజ్ఞతలు
దశాబ్ద కాలంగా నాగులవంచ రైల్వే స్టేషన్ లో అనేక సమస్యలు నెలకొన్నాయని.. ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి.. వాటి పరిష్కారానికి కృషి చేశారని నాగులవంచకు చెందిన పలువురు రైల్వే ప్రయాణికులు, నాగులవంచ పరిసర గ్రామాల ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.















