EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కోటి మంది మహిళలకు కోటి చీరలు అర్హులైన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీర

ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 18:

కోటి మంది మహిళలకు కోటి చీరలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందిరమ్మ చీరలకు సంబంధించి మంగళవారం మంత్రి సీతక్కతో కలిసి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరను అందించాలని అధికారులకు సూచించారు. బుధవారం ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించనున్నారు. చీరలను పూర్తిగా సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేస్తున్నారు. ఉత్పత్తి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఉత్పత్తికి అనుగుణంగా రెండు దశలుగా చీరల పంపిణీ చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు. తొలి దశలో గ్రామీణ ప్రాంతాల్లో చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందిరా గాంధీ జయంతి నుంచి డిసెంబరు 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. రెండవ దశలో పట్టణ ప్రాంతాల్లో మార్చి 1నుంచి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ పూర్తి చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో చీరల నాణ్యత విషయంలో రాజీపడొద్దని, మహిళలకు నాణ్యమైన చీరలను అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సాంకేతికను వినియోగించుకుని ఇందిరమ్మ చీరల పంపిణీ పారదర్శకంగా జరిగేలా చూడాలని, పంపిణీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. బుధవారం ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకు నెక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ చీరల పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం సెక్రటేరియట్ నుంచి గ్రామీణ ప్రాంత మహిళలతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి మాట్లాడుతారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉన్న కలెక్టరేట్ల నుంచి వీడీయోకాన్ఫరెన్స్ లో పాల్గొనాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క, సీఎం సెక్రెటరీ మాణిక్ రాజ్, ప్రిన్సిపల్ సెక్రెటరీ హ్యాండ్లూమ్స్ శైలజా రామయ్యర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్, సెర్ప్ సీఈవో డి.దివ్య, తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top