EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రైతులను రెచ్చగొట్టవద్దు….. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు

ఈతరం భారతం రఘునాథ పాలెం, నవంబర్ -19:

స్వార్థ రాజకీయాల కోసం రైతులను రెచ్చగొట్టవద్దని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.

మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు బుధవారం రఘునాధపాలెం మండల తహసిల్దార్ కార్యాలయంలో పంట కొనుగోలు, వివిధ అంశాలపై మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ చిరకాల మిత్రులు భాజాపా అధ్యక్షులు రాంచందర్ రావు మేధావి కావచ్చు కాని వ్యవసాయం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని, ఆయన మాటలు వింటే రైతాంగం నవ్వుకుంటున్నారని, రాజకీయాల కోసం రైతులను అవమానించవద్దని హితవు పలికారు.పత్తి కొనుగోలు అంశం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని తెలుపుతూ పూర్తి స్థాయిలో కేంద్రం పత్తి కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు పచ్చి అబద్ధాలను రామచందర్ రావు ప్రచారం చేస్తున్నారని అన్నారు. 11.75 క్వింటాళ్ల ఉన్న సరాసరి దిగుబడి అర్థాంతరంగా 7 క్వింటాళ్లకు కేంద్ర ప్రభుత్వం తగ్గించిందని అన్నారు.

కిస్సాన్ కప్పాస్ యాప్ విధానం, తుఫాన్ వచ్చినప్పటి నుండి 8 నుంచి 12 శాతం తేమ రావడం లేదని, మినహాయింపు ఇవ్వాలని అనేక సార్లు కోరినప్పటికీ కేంద్రం స్పందించకుండా రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తుందని అన్నారు. యూరియా సరఫరా, పత్తి కొనుగోలు, ఇతర పంటలకు సంబంధించి కేంద్ర మంత్రుల దగ్గరకు స్వయంగా ముఖ్యమంత్రి వెళ్ళి దరఖాస్తులు అందించిన ఎటువంటి ఫలితం లేదని అన్నారు.జిన్నింగ్ మిల్లుల సంబంధించి ఎల్ 1, ఎల్ 2 విధానం వల్ల రైతులు కష్టపడ్తున్నారని అనేక సార్లు ప్రతిపాదనలు పంపినప్పటికి ధర్నా వరకు పరిస్థితి రావడానికి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని అన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా సోయా, పెసర్లు, కందులు, జొన్నలు, మొక్కజొన్న, వరి వంటి అన్ని పంటలను మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని, ప్రతి సంవత్సరం వేయి కోట్ల రూపాయలు భారం పడినప్పటికీ రైతు సంక్షేమం కోసం భరిస్తున్నామని అన్నారు.

రైతాంగానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పంట రుణాలు 2 లక్షల రూపాయల లోపు ఉన్న రుణాలను పూర్తి స్థాయిలో మాఫీ చేశామని అన్నారు. బ్యాంకుల దగ్గర నుంచి సమాచారం సేకరించి 25 లక్షల 6 వేల మంది రైతులకు ఒకే విడతలో రుణ మాఫీ చేసిన దమ్మున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమని అన్నారు.

భాజాపా పరిపాలిస్తున్న రాష్ట్రాలలో ఒక్క రూపాయి రుణమాఫీ చేసిన చరిత్ర లేదని అన్నారు. ఆర్థిక వ్యవస్థ కుదేలైనప్పటికీ ఒకే సంవత్సరంలో లక్షా 6 వేల కోట్లు రైతు సంక్షేమం అభివృద్ధి కోసం ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వం బాకీ పెట్టిన యాసంగి రైతుబంధు నిధులు విడుదల చేశామని అన్నారు. భారీ వరదల వల్ల లక్ష 22 వేల ఎకరాలలో పంట నష్టం వాటిల్లితే ఎకరానికి 10 వేల రూపాయలు చొప్పున పరిహారం చెల్లించామని, గత సంవత్సరం వరదలకు పరిహారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి అనేక ప్రతిపాదనలు పంపినప్పటికీ ఒక్క రూపాయి కూడా రాలేదని, తెలంగాణ రైతాంగం పట్ల తీవ్రమైన వివక్ష కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం రైతు కుటుంబానికి 6 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎకరానికి 12 వేల రూపాయల పెట్టుబడి సాయం అందిస్తుందని అన్నారు. రైతులను బజారు లో నిలబెట్టిన భాజపా నాయకులు నేడు నీతులు చెప్పడం విడ్డూరమని అన్నారు. జిన్నింగ్ మిల్లుల ఎల్ 1, ఎల్ 2 నిబంధనలు, తేమ శాతం మినహాయింపు ఇవ్వకపోవడం, కొనుగోలు ప్రారంభించిన నెల తర్వాత ఎకరానికి 7 క్వింటాళ్ల నిబంధన పెట్టడం వంటివి కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక నిర్ణయాలకు నిదర్శనమని మంత్రి విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే సహాయంతో ఇక్కడి రైతాంగం దేశంలోనే అత్యధికంగా వరి పంట దిగుబడి సాధించారని అన్నారు.

దేశంలోనే ప్రతి సంవత్సరం దాదాపు 80 లక్షల మేట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తూ బోనస్ అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. ఆయిల్ పామ్ పంటపై దిగుబడి సుంకం ఎత్తివేయడం వల్ల ఇక్కడి రైతులకు నష్టం వాటిల్లిందని అన్నారు. అమెరికా దేశంతో లాలూచీ పడి పత్తిపై దిగుబడి సుంకం 11 శాతం తగ్గించింది వాస్తవం కాదా అని మంత్రి ప్రశ్నించారు. మొక్కజొన్న, సోయాబీన్ వంటి పంటలకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయకుండా ఉంటుందని అన్నారు. గత 10 సంవత్సరాల రాష్ట్రంలో పరిపాలించిన నాయకులు ఎప్పుడూ మార్కెట్ కు వెళ్ళలేదని అన్నారు. వ్యవసాయం అధోగతి పాలు కావడానికి కారణం భారాస పార్టీ అని, రుణమాఫీ లక్ష రూపాయలు చేయడంలో విఫలమయ్యారని, 10 సంవత్సరాల పాలనలో ఎప్పుడైనా ఇంత పంట గత ప్రభుత్వం కొనుగోలు చేసిందా అని మంత్రి బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు.

ప్రభుత్వంపై బురద జల్లేందుకు బిఆర్ఎస్ ప్రయత్నిస్తుందని అన్నారు. గత పాలకుల హాయంలో ధాన్యం కొనుగోలు అంశంలో వేల కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మీద 50 వేల కోట్ల అప్పు భారం పెట్టిందని అన్నారు. భాజాపా నాయకులు ఇప్పటికైనా అనవసరపు విమర్శలు మానుకొని పత్తిపై దిగుబడి సుంకం ప్రవేశ పెట్టాలని, పామ్ ఆయిల్ పై గతంలో ఉన్న 44 శాతం దిగుబడి సుంకం పునఃరుద్దరించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన పత్తి పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు.

రాజకీయాల కోసం రైతులను ఇబ్బంది పెట్టవద్దని, అబద్దాలను ప్రచారం చేయవద్దని అన్నారు. బిఆర్ఎస్ నాయకత్వానికి దమ్ము ఉంటే కుటుంబంలో ఉన్న కలహాలను, అక్కడి నుంచి వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాలని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో కేంద్ర బృందాలు ఇప్పటికీ పర్యటించలేదని, గత సంవత్సరం వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇవ్వలేదని, దీనిపై మాట్లాడే బాధ్యత నాయకులకు ఉండదా అని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top