ఈతరం భారతం హైదరాబాద్, నవంబర్ 19
రాష్ట్రంలో మహిళల అభివృద్ధి, ఆత్మవిశ్వాసము, హక్కుల బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర పంచాయితీ రాజ్, మహిశలా శిశు, సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ అన్నారు. మహిళల సమస్యలు అనే అంశంపై రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ నేడు బేగంపేటలోని ప్రజా భవన్లో నిర్వహించిన ఒక రోజు రౌండ్ టేబుల్ సమావేశానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. పలువురు మహిళా ఐఏఎస్ అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్న ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, మహిళలు ఎదుర్కొంటున్న వివక్షతను రూపుమాపే విధంగా నిపుణులు, మేధావులు, అధికారుల సలహాలు తీసుకుంటామని అన్నారు. మహిళల సంక్షేమం, భద్రత విషయంలో ఎన్నో చట్టాలు ఉన్నా.. సమాజ పోకడల వల్ల కొన్నిసార్లు ఆచరణకు నోచుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు తమ హక్కులు తెలుసుకోలేని పరిస్థితి కొన్నిసార్లు ఎదురవుతోందని అంటూ, ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మహిళలకు విద్యా, ఉపాధి ఉద్యోగ, భద్రత విషయాల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వాలి అన్న అంశాలపై చర్చించి నివేదిక రూపొందించాలని సూచించారు. మహిళా విధానము ఎలా ఉంటే బాగుంటుంది అనే అంశంపై రౌండ్ టేబుల్ కన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయాలు తెలుసుకొని, ఇక్కడ వచ్చే సలహాలు, సూచన ప్రాతిపదికగా మరోసారి త్వరలో భారీ సదస్సును నిర్వహిస్తామని సీతక్క వెల్లడించారు.చిన్నారులు, పిల్లలు, మహిళలు ఉపాధి విద్య అంశాల్లో ప్రభుత్వం ఇంకా ఏమి చేయాల్సి ఉందో తెలుసుకుంటామని చెప్పారు. ఎన్నో ఆటంకాలను చేదించి దేశ ప్రధానిగా ఈ దేశ అభివృద్ధిలో ముద్ర వేసిన ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా మహిళలు ఆత్మగౌరవంతో ఎదగాలనీ ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళ ల ఆర్థిక సాధికారత కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వాలు చట్టాలు, విధానాలు తీసుకొచ్చుకునే విధంగా.. మీరిచ్చే సూచనలు సలహాలు ఉపయోగపడుతుందని, ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఒక చర్చ మాత్రమే కాదు..భవిష్యత్తు మహిళా విధానానికి పునాది వేసే చారిత్రక ఘట్టమని స్పష్టం చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు శైలజా రామయ్యర్, అనిత రామచంద్రన్, దివ్య , దాసరి హరిచందన లతో పాటు వివిధ రంగాల్లో ప్రముఖ మహిళా ప్రతినిధులు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.















