ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 24
హైదరాబాద్, కర్మన్ ఘాట్ కు చెందిన నారోజు శ్రీశైలం(35) అద్దె ఇంటిలో నివసిస్తూ, జీవనోపాధి గా కార్పెంటరీ పని చేస్తున్నారు. వీరికి ఇటీవల జన్మించిన బాబు కు పుట్టిన కొద్ది రోజులకే శ్వాస సంబంధిత తీవ్రమైన సమస్యలు ఎదురయ్యాయి. వెంటనే వనస్థలిపురంలోని లాలిత్య హాస్పిటల్లో చేర్పించగా, వైద్యులు దీనిని లారింగో మలేసియా వ్యాధి గా నిర్ధారించారు. ఈ వ్యాధిలో శ్వాసనాళం పై భాగంలోని మృదుల కణజాలం కిందికి వాలి, శ్వాసలో అడ్డంకి ఏర్పడుతుంది. వైద్యుల సలహా మేరకు, దాదాపు 4 లక్షల రూపాయల ఖర్చుతో, పెద్ద శస్త్రచికిత్స చేయించడం జరిగింది. ఈ మొత్తాన్ని వారు బంధువుల వద్ద అప్పు తీసుకుని, తమ వద్ద ఉన్న కొంత బంగారాన్ని అమ్మి సమకూర్చు కోవడం జరిగింది. అయితే, బిడ్డకి ఇంకా శ్వాసలో ఇబ్బంది కొనసాగు తున్నందున, తిరిగి పరీక్షించిన వైద్యులు, తక్షణమే మరొక శస్త్రచికిత్స అవసరం అని తెలిపారు. ఈ శస్త్ర చికిత్స కోసం దాదాపు ₹2 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు.మహేశ్వరం మండలం మనుమయ సంఘం అధ్యక్షులు దంతోజు ప్రభాకరాచారి ద్వారా ఆర్థిక సహాయం అందించమని కోరుతూ పసివాడి తండ్రి శ్రీశైలం వెస్సో ట్రస్ట్ ను ఆశ్రయించారు. వెస్సో ట్రస్టీలు గౌరవ దాతల సహకారంతో శ్రీశైలం కు 60,600 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వెస్సో ట్రస్ట్ అధ్యక్షులు బంగారు తాతారావు మాట్లాడుతూ నాలుగు నెలల పసి ప్రాయంలో, శ్వాసకోశ సంబంధిత వ్యాధితో జీవన్మరణ పోరాటం చేస్తున్న పసిబిడ్డ శస్త్రచికిత్స నిమిత్తం, ఆర్థిక సహాయం చేసి, ఆదుకొన్న గౌరవ దాతలకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.















