ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 26
జిఒ నం.46ను భేషరతుగా ఉపసంహరించుకుని, 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ముందుకు రావాలని రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ జేఏసీ చైర్మన్ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. కోర్టులో వాదనలు పూర్తికాకముందే GO 46 విడుదల చేయడం, అలాగే ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.బుధవారం నాడు ఉద్యమ కార్యాచరణలో భాగంగా నగరంలోని విద్యానగర్ బీసీ భవన్‌లో ఆర్. కృష్ణయ్య ఒక రోజు రిలే నిరాహార దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహనరావు అధ్యక్షత వహించారు.దీక్ష శిబిరంలో ప్రసంగించిన ఆర్. కృష్ణయ్య, GO 46 కారణంగా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల కేటాయింపులో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. పలు జిల్లాల్లో, అనేక మండలాల్లో, గ్రామాల్లో బీసీలకు ఒక్క సర్పంచ్ లేదా వార్డు సభ్యుని సీటు కూడా కేటాయించలేదని లెక్కలతో సహా వివరించారు. బీసీలకు ఇంతకన్నా పెద్ద మోసం మరొకటి లేదని విమర్శించారు.ఈ మోసాన్ని ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా ఉద్యమాలు, ధర్నాలు, మౌన దీక్షలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్ల వద్ద దీక్షలు, అలాగే ఈ నెల 29న రహదారుల దిగ్భంధం వంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు. రిజర్వేషన్లు అమలు అయ్యేంత వరకు ఉద్యమాలను ఆపేది లేదని, అవసరమైతే రోజురోజుకు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేసిన మోసానికి తగిన గుణపాఠం చెప్పాలని, బీసీల హక్కుల సాధన కోసం ఇదే సరైన సమయమని అన్నివర్గాల బీసీ ప్రజలు ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనాలని కోరారు.శాసన మండలిలో BRS పార్టీ ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదన చారి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యను ఖండించారు. దీన్ని తాడి గుడ్డతో గొంతు కోయడం లాంటిదని వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లు సాధించేంతవరకు విశ్రాంతి తీసుకోమని, BRS పార్టీ ఉద్యమానికి పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు.డా. వకుళాభరణం కృష్ణమోహనరావు మాట్లాడుతూ, కాంగ్రెస్ అంటే మోసం అనేది ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక రెండేళ్లు డ్రామా నడిపి, ఇప్పుడు ఇవ్వలేమని చేతులు ఎత్తివేయడం దుర్మార్గమని విమర్శించారు.సినీ దర్శకుడు, నిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ, రేవంత్ ప్రభుత్వం ఇలా వ్యవహరించడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమని తెలిపారు. దీక్షకు పూర్తి మద్దతు ప్రకటించారు.బీసీ యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ పాలూరు రామకృష్ణయ్య మాట్లాడుతూ, ప్రభుత్వ వైఖరిని ఖండించారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేసి హక్కులు సాధించడానికి సిద్ధమని తెలిపారు.రాష్ట్ర బిజెపి బిసి మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ, బిజెపి పూర్తిస్థాయి మద్దతును అందిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం 42 శాతం మాటకు కట్టుబడి రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోఆర్డినేటర్ డా. ర్యాగ అరుణ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రం తప్పులు చేసి కేంద్రంపై ఆరోపణలు చేయడం అవివేకమని వ్యాఖ్యానించారు. రేవంత్ ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న చర్యలు అన్నీ తప్పు విధానాలేనని, నిజాయితీ ఉంటే బీసీలకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.దీక్ష సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. దీక్ష జరుగుతున్న సమయంలో విద్యానగర్ పరిసర ప్రాంతాలు బీసీ సంఘాల ప్రతినిధులతో కోలాహలంగా కనిపించాయి. దీక్షలో వివిధ కుల సంఘాల నాయకులు, ప్రముఖులలో గుజ్జ సత్యం, గొరిజె మల్లేశ్ యాదవ్, నీలా వెంకటేష్, జి. అంజి, సి. రాజేందర్, గుడిసె వాసుల సంఘం అద్యక్షులు బాకి రవి, భుమన్నా యాదవ్, రాజా గౌడ్, సతీష్, ఆనంద్, అన్నపూర్ణ గౌడ్, జి. పద్మ,కే. లక్ష్మి,లతా సింగ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు.















