ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 4
తెలంగాణలోని డ్వాక్రా సంఘాల మహిళలకు ప్రభుత్వం ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది.ముఖ్యంగా స్త్రీనిధి ద్వారా రుణాలు తీసుకుని… నెలనెలా కట్టాల్సిన వాయిదాలను ఎగ్గొడుతున్న వారిపై ఇకనుంచి కఠిన చర్యలు తీసుకోనున్నారు. అప్పు తీసుకున్న వారు చెల్లించకపోతే.. ప్రభుత్వం తనకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి బకాయిలను వసూలు చేయాలని నిర్ణయించింది.ఇందుకోసం ‘రెవెన్యూ రికవరీ’ అనే చట్టాన్ని అమలులోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఉత్తర్వులను జారీ చేసింది.
ఏమిటీ ‘రెవెన్యూ రికవరీ’ చట్టం?
ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను వసూలు చేసేందుకు ఈ చట్టాన్ని ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగిస్తారు. దీని ప్రకారం రుణం చెల్లించని వారి ఆస్తులను జప్తు చేసే అధికారం అధికారులకు లభిస్తుంది. ఇళ్లు, భూములు వంటి స్థిరాస్తులతో పాటు ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుని, వాటిని బహిరంగంగా వేలం వేస్తారు. ఆ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వం తన బకాయి కింద జమ చేసుకుంటుంది. ఈ చట్టం అమలుతో బకాయిదారులపై ఒత్తిడి పెంచి, వసూళ్లను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఒక్కరు కట్టకపోయినా అందరికీ చిక్కులు!
ఈ చట్టంలో అత్యంత కీలకమైన అంశం ఒకటుంది. రుణం తీసుకున్న సభ్యురాలి పేరు మీద ఎలాంటి ఆస్తులు లేకపోతే, ఆ అప్పును తీర్చే బాధ్యత గ్రూప్‌లోని మిగిలిన సభ్యులపై పడుతుంది. అంటే, ఒకరు చేసిన పొరపాటుకు సంఘంలోని అందరూ బాధ్యత వహించాల్సి వస్తుంది. అవసరమైతే ఇతర సభ్యుల ఆస్తులను కూడా జప్తు చేసేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో, సంఘంలోని మహిళలు పరస్పర సహకారంతో సకాలంలో రుణాలు చెల్లించేలా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.ఇప్పటికే సెర్ప్, మెప్మా అధికారులు గ్రామాల్లో పర్యటించి బకాయిల చెల్లింపుపై అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ స్పందన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, ప్రభుత్వ ఆదేశాల మేరకు కఠినంగా వ్యవహరించనున్నట్లు డీఆర్డీఏ అధికారులు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ల నుంచి కూడా అనుమతులు రావడంతో, త్వరలోనే జప్తు ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.















