EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

వెనుజులా సంక్షోభం : చమురు ఉన్నా చీకట్లోనేనా దేశ భవిష్యత్తు?  – భారత సుదర్శన్, సీనియర్ జర్నలిస్ట్ & విశ్లేషకులు

ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 5

లాటిన్ అమెరికాలో ఉన్న ‘వెనుజులా’ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిక్షేపాలు ఉన్న దేశం. ఇది దక్షిణ అమెరికాలోని ఉత్తర సముద్ర తీరంలో ఉంది. జీవ వైవిధ్యంలో ఈ దేశం ప్రపంచంలోనే 7వ స్థానంలో ఉంది. ఈ దేశ అతివలు ప్రపంచ అందాల పోటీలలో గెలుస్తుంటారు. దీని రాజధాని కార్కాస్. అధికారిక కరెన్సీ వెనుజులా బొలివర్. ఒకప్పుడు అత్యంత సంపన్న దేశంగా గుర్తింపు పొందినది వెనుజులా. కానీ నేడు అదే దేశం ఆకలి, నిరుద్యోగం, వలసలు, రాజకీయ గందరగోళానికి ప్రతీకగా మారింది. చమురు ఉన్న దేశాలు శక్తివంతంగా మారతాయనే సాధారణ అభిప్రాయానికి విరుద్ధంగా, వెనుజులా కథ ఒక హెచ్చరికలా నిలుస్తోంది. ఇక్కడి సంక్షోభం కేవలం ఒక దేశ అంతర్గత సమస్య కాదు. ఇది అంతర్జాతీయ రాజకీయాలపై, అమెరికా–లాటిన్ అమెరికా సంబంధాలపై, చైనా–రష్యా వ్యూహాలపై, అంతేకాదు ప్రపంచ ఇంధన మార్కెట్లపై కూడా ప్రభావం చూపుతున్న ఒక గ్లోబల్ క్రైసిస్. అయితే ప్రశ్న ఒక్కటే — అపారమైన సహజ సంపద ఉన్నా, వెనుజులా ఎందుకు ఈ స్థాయికి పడిపోయింది? ఈ సంక్షోభానికి మూల కారణాలేంటి? ఇప్పుడైనా ఆ దేశానికి వెలుగు కనిపిస్తుందా? 2026 జనవరి నాటికి, ఈ సంక్షోభం కొత్త మలుపు తిరిగింది – అమెరికా మిలిటరీ దాడులతో మడూరోను కస్టడీలోకి తీసుకోవడం, దేశాన్ని ‘కంట్రోల్’ చేస్తామని ట్రంప్ ప్రకటన – ఇవి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి.

రాజకీయ అస్థిరత – అధికారమే లక్ష్యంగా మారిన పాలన :

హ్యూగో చావేజ్ మరణానంతరం అధికారంలోకి వచ్చిన నికోలస్ మడూరో, చావేజ్ ప్రారంభించిన సామ్యవాద విధానాలను కొనసాగిస్తానని చెప్పి, క్రమంగా అధికారాన్ని తన చేతుల్లో కేంద్రీకరించారు. మొదట ప్రజల మద్దతుతో ఎదిగిన మడూరో పాలన, కాలక్రమేణా ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచే దిశగా సాగిందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. వెనుజులాలో గత కొన్ని సంవత్సరాలుగా అధ్యక్షుడు నికోలస్ మడూరో నేతృత్వంలోని ప్రభుత్వం తీవ్ర విమర్శల నడుమ కొనసాగుతోంది. ఎన్నికల పారదర్శకతపై అనుమానాలు, ప్రతిపక్ష నేతల అరెస్టులు, మీడియాపై ఆంక్షలు, న్యాయవ్యవస్థ స్వతంత్రతపై సందేహాలు — ఇవన్నీ దేశాన్ని రాజకీయ అస్థిరత వైపు నెట్టాయి. ప్రతిపక్షం మడూరో ప్రభుత్వాన్ని నియంతృత్వ పాలనగా అభివర్ణిస్తుంటే, ప్రభుత్వం మాత్రం అమెరికా నేతృత్వంలోని విదేశీ శక్తుల కుట్రలే దేశ సంక్షోభానికి కారణమని ఆరోపిస్తోంది. ఈ రెండు ధ్రువాల మధ్య వెనుజులా సమాజం తీవ్రంగా చీలిపోయింది. 2025లో వివాదాస్పద ఎన్నికల తర్వాత, మడూరో మళ్లీ అధికారంలోకి వచ్చారు, కానీ ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో “సమయం ముగిసింది” అంటూ హెచ్చరించారు. 2026 జనవరి 3న, అమెరికా మిలిటరీ స్ట్రైక్స్‌తో మడూరోను క్యాప్చర్ చేసి, న్యూయార్క్ కోర్టుకు తీసుకువచ్చారు – డ్రగ్ ట్రాఫికింగ్ చార్జెస్‌పై. ఇది దేశాన్ని మరింత అస్థిరతలోకి నెట్టింది, మాంట్రియల్‌లో వెనుజులా ప్రజలు ర్యాలీలు చేస్తున్నారు.

ఆర్థిక సంక్షోభం – చిత్తయిన చమురు ఆర్థిక వ్యవస్థ :

వెనుజులాకు ఉన్న అతిపెద్ద బలం – అదే దాని బలహీనతగా మారింది. ఈ దేశంలో సుమారు 303 బిలియన్ బ్యారెళ్ల చమురు నిక్షేపాలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యధికం. అయితే, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న చమురు సంస్థ PDVSA లో అవినీతి, సాంకేతిక పెట్టుబడుల లేమి, అనుభవజ్ఞులైన ఇంజినీర్ల వలస, అంతర్జాతీయ ఆంక్షల వల్ల ఎగుమతులపై ఆంక్షలు వంటి కారణాలతో చమురు ఉత్పత్తి తీవ్రంగా తగ్గిపోయింది. ఒకప్పుడు రోజుకు 30 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేసిన వెనుజులా, ఇప్పుడు దాని సగం కూడా ఉత్పత్తి చేయలేని పరిస్థితికి చేరింది. దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఒక్క రంగం మీదే ఆధారపడింది. ఉత్పత్తి రంగాలు అభివృద్ధి చేయలేదు. అప్పుల మీద అప్పులు చేశారు. అప్పు తీర్చే సామర్థ్యం లేకపోయింది. విదేశీ ఆర్థిక వ్యవస్థలపై ఆధారపడాల్సి వచ్చింది. దీని ప్రభావం నేరుగా ప్రజలపై పడింది. అప్పు ఇచ్చినవారు దేశ ఆర్థిక వ్యవస్థను నియంత్రించారు. ప్రజలు పేదరికంలోకి నెట్టబడ్డారు. భయంకరమైన ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ పతనం, ఆహారం, ఔషధాల కొరత, నిరుద్యోగం పెరుగుదల, జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయి, ఆదాయాలు పడిపోయాయి. మధ్యతరగతి దాదాపుగా అంతరించిపోయిన పరిస్థితి నెలకొంది. వెనుజులా దేశం ఆర్థికంగా బానిస అయింది. 2025 నాటికి, హైపర్‌ఇన్‌ఫ్లేషన్ రేటు 1000% దాటింది, మిలియన్ల మంది వలసలు పెరిగాయి. చైనా, రష్యా నుంచి లోన్లు తీసుకుని చమురు కొల్లాటరల్‌గా ఇవ్వడం వల్ల సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. ట్రంప్ ప్రకటన ప్రకారం, అమెరికన్ కంపెనీలు చమురు ఇండస్ట్రీని పునరుద్ధరిస్తాయని, ఇది $1.7 ట్రిలియన్ బిజినెస్ అవకాశమని మరియా కొరినా మచాడో అంచనా.

అంతర్జాతీయ ఆంక్షలు – పరిష్కారమా? ప్రజల శిక్షనా? :

మడూరో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా సహా పాశ్చాత్య దేశాలు వెనుజులాపై కఠిన ఆర్థిక ఆంక్షలు విధించాయి. వాటికి కారణంగా మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రజాస్వామ్య పతనం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలను ప్రస్తావించాయి. ఇటీవలి పరిణామాల్లో మడూరోను అరెస్ట్ చేసి అమెరికాకు తరలించడం ఈ ఘర్షణను కొత్త దశకు తీసుకెళ్లింది. అమెరికా వాదన ప్రకారం… మడూరో ప్రభుత్వం “నార్కో స్టేట్”గా మారిందని, డ్రగ్ ట్రాఫికింగ్ ద్వారా అంతర్జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తోందని ఆరోపించింది. కానీ విమర్శకుల అభిప్రాయం వేరేలా ఉంది. ఈ ఆంక్షల వల్ల ప్రభుత్వానికి కంటే సామాన్య ప్రజలే ఎక్కువగా నష్టపోతున్నారని, ఇది ఒక దేశాన్ని శిక్షించడమే తప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కాదని వారు అంటున్నారు. వెనుజులా దేశంలోని ఈ పరిస్థితుల వల్ల లక్షలాది ప్రజలు దేశం విడిచి వెళ్లారు. ఇది లాటిన్ అమెరికా చరిత్రలోనే అతిపెద్ద వలస సంక్షోభంగా మారింది. ఇదే సమయంలో చైనా, రష్యా వంటి దేశాలు వెనుజులాకు మద్దతుగా నిలుస్తూ, అక్కడి చమురు వనరులపై తమ వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో వెనుజులా ఒక దేశంగా కాకుండా ‘ప్రపంచ శక్తుల రాజకీయ చెస్ బోర్డు’ గా మారిపోయింది. UN సెక్యూరిటీ కౌన్సిల్ ఎమర్జెన్సీ మీటింగ్ పిలిచింది, కెనడా ప్రధాని మార్క్ కార్నీ “వెనుజులా-లెడ్ ట్రాన్సిషన్” అంటూ ప్రకటించారు.

ఆ దేశ భవిష్యత్తు ఏంటి? :

వెనుజులా దేశ భవిష్యత్తు ఇప్పుడు అత్యంత కీలక దశలో ఉంది. రాజకీయ సంభాషణ లేకుండా, పారదర్శక ఎన్నికలు నిర్వహించకుండా, ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టకుండా ఈ సంక్షోభం నుంచి బయటపడటం అసాధ్యం. ఈ సంక్షోభం ఒక ప్రభుత్వ వైఫల్య కథ మాత్రమే కాదు. సహజ వనరులు ఉన్నా సరైన పాలన లేకపోతే దేశం ఎలా కుప్పకూలుతుందో చెప్పే గ్లోబల్ హెచ్చరిక ఇది. వెనుజులా తిరిగి నిలబడాలంటే… అధికార అహంకారాలకంటే ప్రజల శ్రేయస్సు, విదేశీ శత్రుత్వాలకంటే జాతీయ సమగ్రత, సంపద రాజకీయాలకంటే బాధ్యతాయుత పాలన ముఖ్యమవాలి. ప్రకృతి సంపద దేశాన్ని గొప్పదాన్ని చేయదు..దానిని న్యాయంగా, బాధ్యతతో పాలించే నాయకత్వమే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇది ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచ దేశాలన్నింటికీ వర్తిస్తుంది. ఇంటరిమ్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగెజ్ అమెరికాతో సహకరిస్తామని చెప్పడం, ట్రంప్ “మేము ఇన్‌చార్జ్” అనడం – ఇవి దేశానికి కొత్త ఆశలు కలిగిస్తున్నాయా లేక మరిన్ని సవాళ్లా? ప్రపంచం ఉత్కంఠగా చూస్తోంది.

Related News

Select the Topic
Scroll to Top