ఈతరం భారతం హైదరాబాద్ ఏప్రిల్ 2
తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతిష్టాత్మకమైన ‘చేయూత’ పథకం కింద అదనంగా మరో 2 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి 2026-27 వార్షిక బడ్జెట్లో ఏకంగా రూ.233 కోట్లను కేటాయించడంతో, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఈ క్రమంలో అర్హులైన వారిని గుర్తించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు త్వరలోనే క్షేత్రస్థాయిలో వడబోత కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర కేటగిరీల కింద నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.గత కొంతకాలంగా పెన్షన్ల మంజూరు కోసం వేచి చూస్తున్న వారికి ఈ బడ్జెట్ కేటాయింపులు కొండంత ఆశను కల్పించాయి. త్వరలోనే కొత్త లబ్ధిదారుల జాబితాను ఖరారు చేసి, పెన్షన్ల పంపిణీని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది రాష్ట్రంలోని పేద వర్గాలకు ఆర్థికంగా పెద్ద ఊరటనిచ్చే అంశం.















