ఈతరం భారతం హైదరాబాద్ ఏప్రిల్ 4
హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ మరియు సికింద్రాబాద్ పరిధిలో జిహెచ్ఎంసి అధికారులు చేపట్టిన కూల్చివేతలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ముందస్తు సమాచారం లేకుండా తమ పొట్ట కొడుతున్నారంటూ చిరు వ్యాపారులు అధికారులను అడ్డుకోవడంతో పరిస్థితి రణరంగంగా మారింది.రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఆరాంఘర్ వద్ద చిరు వ్యాపారుల షాపులను తొలగించేందుకు జిహెచ్ఎంసి
అధికారులు భారీ పోలీసు బందోబస్తుతో రంగంలోకి దిగారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా హఠాత్తుగా కూల్చివేతలు చేపట్టడంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “కాస్త సమయం ఇస్తే మేమే సామాన్లు సర్దుకుంటామని వేడుకున్నా అధికారులు కనికరించలేదు” అని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. అధికారుల కఠిన వైఖరిని నిరసిస్తూ వ్యాపారులు ఎదురుతిరగడంతో అక్కడ తోపులాట చోటుచేసుకుంది.మరోవైపు సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పరిస్థితి మరింత విషమించింది. అధికారులు జేసీబీలతో కూల్చివేతలు ప్రారంభించగా, వ్యాపారులు సంఘటితమై అధికారులను, పోలీసులను అడ్డుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోయిన కొందరు వ్యాపారులు జేసీబీలపై దాడికి యత్నించడంతో జిహెచ్ఎంసి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.















