ఈతరం భారతం హైదరాబాద్ ఏప్రిల్ 19
ప్రముఖ జాతీయ కవి, రచయిత, బహుభాషావేత్త డా. పెరుక రాజు అసాధారణ సాహిత్య ప్రతిభకు గుర్తింపుగా, ఆయన పేరు “ప్రతిభా రికార్డుల గ్రంథం”లో నమోదు అయింది. సామాజిక చైతన్యంతో కూడిన శక్తివంతమైన రచనల ద్వారా ఆయన చూపుతున్న విశిష్ట ప్రతిభకు ఈ గౌరవం లభించింది. సాధారణంగా వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనపరచిన ముఖ్యుల్లో కొందరికి మాత్రమే స్థానం దక్కుతుంది.
ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని త్యాగరాయ గాన సభలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో డా. రాజు గారికి స్మారక చిహ్నం (మెమెంటో), శాలువా, పతకం (మెడల్) మరియు రికార్డు పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడుడా. రంజిత్, సుప్రీం కోర్టు జడ్జ్ బురుగుల మధుసూదనరావు చిత్ర దర్శక-నిర్మాత జి. విజయ్ కుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్త రాజ శేఖర్, నిర్మాత విక్కు నాయక్, నటి నమ్రత, విద్యావేత్త ఆంజనేయులు తదితర సాహితీ, విద్యా రంగ ప్రముఖులు పాల్గొన్నారు. యువత, విద్యార్థులు, సాహిత్యాభిమానులు, వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.తెలంగాణ ముద్దుబిడ్డగా పేరుగాంచిన డా. పెరుక రాజు గారు ప్రస్తుతం దేశ రక్షణ శాఖలోని ఆర్మీ విభాగంలో జూనియర్ అధికారి హోదాలో సేవలందిస్తున్నారు. జాతీయ కవిగా, గేయకవిగా, రచయితగా, అనువాదకుడిగా ఆయన అనేక భారతీయ భాషల మధ్య భావాలు, సంస్కృతులను సమన్వయం చేస్తూ విశేష గుర్తింపు పొందారు.
సాహిత్యంతో పాటు సామాజిక సేవలోనూ డా. రాజు ముందంజలో ఉన్నారు. పేద మరియు అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలనే లక్ష్యంతో “మై గిఫ్ట్” అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి సేవలందిస్తున్నారు. “ప్రోత్సహించడమే నిజమైన బహుమతి” అన్నది ఆయన జీవన సిద్ధాంతం.ఈ ఏడాదిలోనే డా. పెరుక రాజు ఏడు ప్రతిష్ఠాత్మక సాహితీ పురస్కారాలు అందుకున్నారు. స్వర్ణ కంకణం, నంది అవార్డు, జాతీయ ఉత్తమ కవితా పురస్కారం వంటి గౌరవాలతో పాటు అనేక గుర్తింపులు పొందుతూ జాతీయ స్థాయిలో ప్రముఖ సాహిత్య స్వరంగా ఎదిగారు. ఆంగ్ల పత్రికల్లో ఆయన రోజువారీ కాలమ్స్ రాస్తూ సాహిత్య చింతనను విస్తరిస్తున్నారు.డా. రాజుకి లభించిన ఈ గౌరవం ఆయన సాహిత్య ప్రతిభకే కాకుండా, జాతీయ విలువలు, సామాజిక బాధ్యత, సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. డా. రాజు ను పలువురు అభినందించారు.















