ఈతరం భారతం సికింద్రాబాద్, ఏప్రిల్ 19:
సికింద్రాబాద్ ప్యారడైజ్ పీజీ కళాశాలలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రంలో ఎం ఏ( తెలుగు) విద్యార్థుల వీడ్కోలు వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు తమ కవితలు, వ్యాసాలతో రూపొందించిన ‘మా ఊరు జీవన స్వరం’ అన్న కవిత్వ వ్యాస సంకలనాన్ని ఆవిష్కరించారు.
అంబేద్కర్ యూనివర్సిటీ తెలుగు విభాగం అధ్యక్షులు ఆచార్య ఎన్ రజని సంపుటిని ఆవిష్కరించగా గౌరవ అతిథిగా హాజరైన మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగం అధ్యక్షులు ఆచార్య ఆకుమర్తి నాగేశ్వరరావు తొలి ప్రతిని స్వీకరించారు. ఆత్మీయ అతిథిగా తెలుగు వన్ ఛానల్ సీఈఓ దుర్గాప్రసాద్ హాజరయ్యారు. పుస్తకావిష్కరణ చేసిన ఆచార్య రజని మాట్లాడుతూ ఇప్పటివరకు తెలుగు శాఖలో ఎంఏ విద్యార్థులు తమ స్వీయ రచనలతో మొత్తం నాలుగు సంకలనాలను వెలువరించడం వారి సృజనాత్మక కృషికి అర్థం పట్టిందని అభినందించారు. అమ్మంటే, నాన్న కోసం, జ్ఞాన భాస్కరుడు గురువు అన్న గత సంకలనాలు కాక ప్రస్తుతం తాము పుట్టి పెరిగిన ఊరును స్మరించుకుంటూ మా ఊరు జీవనస్వరం పేరుతో కవిత్వ వ్యాస సంకలనాన్ని విద్యార్థులు వెలువరించారని తెలిపారు. విద్యార్థులు తమ సృజనాత్మక శక్తిని మెరుగు పెట్టుకునేందుకు ఇలాంటి సంపుటాలు తోడ్పడతాయని ఆమె అభిప్రాయపడ్డారు.
గౌరవ అతిథిగా హాజరైన ఆచార్య నాగేశ్వరరావు మాట్లాడుతూ ఒకనాటి ఊరు అనుబంధాలకు నిలయమని గుర్తు చేస్తూ మారుతున్న పరిస్థితులలో గ్రామాల జీవన తీరులలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఊరిని స్మరించుకుంటూ విద్యార్థులు చేసిన పుస్తక ప్రయత్నాన్ని ఆయన ప్రశంసించారు. కార్యక్రమానికి డాక్టర్ తిరునగరి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. మా ఊరు జీవనస్వరం పుస్తక రూపకల్పనలో సమన్వయకర్త బాధ్యతలను నిర్వహించిన డాక్టర్ సుధాకర్ భట్టు మాట్లాడుతూ విద్యార్థులలో తమ ఊరి జ్ఞాపకాలను చైతన్య పరచి ఆ అనుభవాలను రచనలుగా మలచి పుస్తక రూపంలో తేవడం జరిగిందని వివరించారు. ఆచార్యులు చిగిచెర్ల కృష్ణారెడ్డి, డాక్టర్ బోనాల మురళి, డాక్టర్ మారోజు దేవేంద్ర, డాక్టర్ మహేందర్ బర్ల, డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ, విద్యార్థులు దుర్గేష్ మద్దూరి, డాక్టర్ ఎం నాగేశ్వరరావు, విష్ణు, సుజాత సూరంపూడి, సిద్ధి రాములు, సిద్ధార్థ, ఉదయ్ చరణ్, జి నవీన్, సునీత, స్నేహ, స్రవంతి, శోభారాణి, మమత, ఎస్ మరియ, కౌసల్య, సంధ్యారాణి, మహాలక్ష్మి, శ్రీకాంత్, కిరణ్,అయిలేష్ కుమార్, వీర రాఘవులు,భైరవన్ శర్మ, శ్రీనివాసమూర్తి, అయేషా, దామోదర్ రెడ్డి, తండు శివుడు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గురు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కదంబ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.















