ఈతరం భారతం హైద్రాబాద్ ఏప్రిల్ 19
ఏప్రిల్ 17వ తేదీ భారత మహిళల చరిత్రలో ఒక చీకటి రోజుగా, బ్లాక్ డేగా మిగిలిపోయిందని, రాహుల్ గాంధీ నాయకత్వంలోని ఇండియా అలయన్స్ దేశంలోని మహిళలతో పాటు మొత్తం దక్షిణ భారతదేశాన్ని ఘోరంగా మోసం చేసిందని కేంద్రమంత్రి శోభా కరంద్లాజే మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మహిళలు చిరకాలంగా కోరుకుంటున్న 33 శాతం రిజర్వేషన్ బిల్లుతో పాటు, దక్షిణ భారత రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడేలా కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును తీసుకువచ్చిందని గుర్తు చేశారు. జనాభా నియంత్రణ పాటిస్తున్న దక్షిణ రాష్ట్రాలకు భవిష్యత్తులో జనగణన తర్వాత ఎలాంటి అన్యాయం జరగకుండా రక్షణ కల్పించడమే ప్రధాని మోదీ గారి ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు. అయితే పార్లమెంటులో ఈ బిల్లులు విఫలమైనప్పుడు కాంగ్రెస్, ఇండీ అలయెన్స్ పార్టీల నాయకులు దేశ ప్రయోజనాలను మరిచి, ఆ వైఫల్యాన్ని పండుగలా జరుపుకున్నారని.. వారి నవ్వులు, హగ్‌లు దేశాన్ని ఉత్తర-దక్షిణంగా విభజించే కుట్రకు నిదర్శనమని మండిపడ్డారు.
దక్షిణ భారతానికి న్యాయం చేసే ఉద్దేశంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. ప్రతి రాష్ట్రానికి 50 శాతం సీట్లు పెంచుతామని, కేవలం ఒక గంట సమయం ఇస్తే కొత్త బిల్లును తీసుకువస్తామని ప్రతిపాదించినప్పటికీ, కాంగ్రెస్ మరియు ఇండీ అలయన్స్ పార్టీలు దాన్ని తిరస్కరించాయని శోభా కరంద్లాజే ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తమ రాజకీయ లాభాల కోసం, భవిష్యత్తులో ప్రాంతీయ విభేదాలను మరింత పెంచేలా వారు వ్యవహరించారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత పదేళ్లుగా మహిళా సాధికారతకు పెద్దపీట వేశామని.. విద్య, స్కాలర్‌షిప్‌లు, బీమా పథకాలతో పాటు ముద్ర లోన్లలో 60 శాతం, MSME సబ్సిడీల్లో 53 శాతం మహిళలకే అందించామని పేర్కొన్నారు. అటల్ బిహారీ వాజపేయి గారి స్వయం సహాయక సంఘాల ఆలోచనను విస్తరించి, నేడు 3 కోట్లకు పైగా మహిళలను “లఖ్ పతి దీదీలు”గా తీర్చిదిద్దిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదేనని, మహిళ చేతిలో డబ్బు ఉంటే కుటుంబానికి, దేశానికి మేలు జరుగుతుందని ఆమె అన్నారు.
మహిళల్లో ఉన్న నాయకత్వ లక్షణాల గురించి వివరిస్తూ.. కర్ణాటకలో ఒక చదువు రాని గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు సమర్థవంతంగా పనిచేసి మొదటి బహుమతి పొందిన ఉదాహరణను ఆమె ప్రస్తావించారు. నేటి మహిళలు రక్షణ రంగంలో ఫైటర్ జెట్‌లు నడుపుతూ దేశానికి సేవ చేస్తున్నారని, అయినప్పటికీ రాజకీయాల్లో వారికి సరైన అవకాశాలు రాకుండా కాంగ్రెస్ వంటి పార్టీలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వంలో ముద్ర లోన్లలో 63-64 శాతం మహిళలకే దక్కాయని, ఎంఎస్ఎంఈ (MSME) సబ్సిడీలు 53 శాతానికి పైగా మహిళలు పొందారని స్పష్టం చేశారు. కర్ణాటక కోస్టల్ ప్రాంతంలోని మత్స్యకార మహిళల జీవనశైలిని ఉదాహరణగా చూపుతూ, మహిళల చేతిలో ఆర్థిక శక్తి ఉంటే నిర్ణయాధికారం ఎలా మారుతుందో వివరించారు.
కాంగ్రెస్‌లో మహిళలకు అవకాశం అంటే అది కేవలం ఇందిరా, సోనియా, ప్రియాంక గాంధీ వంటి ఒకే కుటుంబానికి పరిమితమని.. దీనికి భిన్నంగా బీజేపీ సామాన్య కుటుంబాల మహిళలకు ప్రతిభ ఆధారంగా ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. దక్షిణ భారత రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళలలో సీట్లు పెంచే ప్రతిపాదనను అడ్డుకోవడం ద్వారా ఇండియా కూటమి దక్షిణ భారతాన్ని మోసం చేసిందన్నారు. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) వల్ల తెలంగాణలో ఎంపీ సీట్లు 17 నుండి 26కు, ఆంధ్రప్రదేశ్‌లో 25 నుండి 38కి పెరుగుతాయని, ఈ ప్రయోజనాన్ని ఇండీ కూటమి అడ్డుకుందని ఆరోపించారు.
కాంగ్రెస్ నాయకత్వం గురించి మాట్లాడుతూ, ఆ పార్టీలో కేవలం “ఖాన్దాన్” (వారసత్వ) రాజకీయాలే నడుస్తాయని, జార్కిహోళి కుమార్తెకు టికెట్ ఇవ్వడాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో తనను తాను “జాదూగర్” (మాంత్రికుడు) అని సంబోధించుకుంటూ అపరిపక్వంగా ప్రవర్తించారని విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై, ప్రజలకు చేసిన అన్యాయం పట్ల రేవంత్ సర్కారు పై నిప్పులు చెరిగారు. గత ఎన్నికల సమయంలో మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఆసరా పెన్షన్ల పెంపు, పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం వంటి ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుని మోసం చేయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. చివరగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం హైకమాండ్‌ను సంతోషపెట్టడానికే ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, హామీల అమలులో విఫలమై రాష్ట్ర ప్రజలను “పిక్ పాకెట్” చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు.
పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ తీరు పూర్తిగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని విమర్శించారు. మహిళలకు స్వరం ఉందని, వారికి చట్టసభల్లో ప్రాధాన్యత కల్పించి, నిర్ణయాత్మక ప్రక్రియలో భాగస్వాములను చేసినప్పుడే సమాజానికి న్యాయం జరుగుతుందని, మహిళలను వంచించిన కాంగ్రెస్, ఇండీ అలయెన్స్ పార్టీలు దేశ ప్రజల ఆగ్రహం నుంచి తప్పించుకోలేరని కేంద్రమంత్రి శోభా కరంద్లాజే హెచ్చరించారు.
ఈ మీడియా సమావేశంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు , బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ , బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక రెడ్డి గారు, బిజెపి రాష్ట్ర కార్యదర్శి విజయలక్ష్మి , బిజెపి మహిళా మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు డా.మేకల శిల్పారెడ్డి , మీడియా ప్యానలిస్ట్ డా.ప్రభా గౌడ్ , తదితరులు పాల్గొన్నారు.















