ఈతరం భారతం వైరా,22 జూన్, 2026 :
వైరా నియోజకవర్గం సమావేశం కమ్మ కల్యాణ మండపం నందు జరిగింది. ఈసమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,ఎమ్మెల్సీలు తాత మధుసూదన్,తక్కిళ్లపల్లి రవీందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ..తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని, సామాన్య ప్రజలను నట్టేట ముంచిందని బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కేసీఆర్ గారి హయాంలో ‘నాట్లకి నాట్లకి’ అండగా నిలిచిన రైతుబంధును కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఓట్ల పండగ’గా మార్చిందని మండిపడ్డారు.వానాకాలం, యాసంగి వస్తున్నా రైతులకు పెట్టుబడి సాయం అందక అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు బీమా,రైతు బంధు అటకెక్కాయి.బీఆర్ఎస్ పాలనలో రైతు చనిపోతే దశదినఖర్మ లోపే రూ. 5 లక్షల బీమా సొమ్ము అకౌంట్లలో పడేదని, కానీ నేడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ప్రీమియం కూడా కట్టకపోవడంతో రూ. 1400 కోట్ల ప్రీమియం బాకీ పడిందని విమర్శించారు. రుణమాఫీని కూడా అరకొరగా చేసి రైతులను వంచించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.యూరియా కోసం యాప్‌ల తిప్పలు..నాడు కేసీఆర్ గారి హయాంలో యూరియా బస్తాలు నేరుగా రైతులకు అందుబాటులో ఉంటే, నేడు షాపుల్లో దొరకాల్సిన యూరియాను యాప్‌లలో పెట్టారని, తీరా చూస్తే ఆ యాప్ అస్సలు పనిచేయడం లేదని ఎద్దేవా చేశారు.
కల్లాల్లోనే ధాన్యం తడిసిపోయిందని పోయిన యాసంగిలో పండించిన పంటను కొనే నాథుడు లేక, కనీసం గోనె సంచులు కూడా సరఫరా చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసిందని, నెలన్నర రోజులుగా రైతులు కల్లాల్లోనే ఉంటూ వర్షానికి ధాన్యం తడిసిపోతుంటే గడగడ వణికిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆడబిడ్డలకు ఇస్తామన్న రూ. 2500 మహాలక్ష్మి పథకం, వృద్ధులకు ఇస్తామన్న రూ. 4000 పెన్షన్, మరియు నిరుద్యోగ భృతి వంటి ఆరు గ్యారెంటీల హామీలన్నీ అటకెక్కాయని నాయకులు దుయ్యబట్టారు. 30 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క హామీని సక్రమంగా నెరవేర్చలేదని, పైగా హైదరాబాద్‌లో భూములను అమ్ముకుంటూ కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు.మొన్న జరిగిన వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజా తీర్పును అపహాస్యం చేస్తూ, కౌన్సిల్ సమావేశంలో ఒక మహిళా కౌన్సిలర్ అడిగిన ప్రజా సమస్యల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, మున్సిపల్ చైర్మన్ ఆమెను దుర్భాషలాడటం కాంగ్రెస్ అహంకారానికి పరాకాష్ట అని దుయ్యాపట్టారు.
కార్యకర్తలందరు కలిసి మెలిసి పనిచేసి బీఆర్ఎస్ జెండాను ఎగరవేయాలని కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేసి ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.















