ఈతరం భారతం ఓవర్సీస్ న్యూస్ జూన్ 22
ఖతార్ రాస్ లఫాన్ నేచురల్ గ్యాస్ క్షేత్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో పలువురు భారతీయులు సహా కనీసం 13 మంది ప్రాణాలు కోల్పోగా..మరో 66 మంది గాయపడినట్టు ఖతార్ ఇంధన శాఖ మంత్రి ధ్రువీకరించారు. ”ఎన్నడూ జరగకూడదని నేను కోరుకున్న ఒక విషయాన్ని ఈరోజు ఇక్కడ ప్రకటించాల్సి వస్తోంది.. భారత, పాక్ జాతీయులు, మనవాళ్లు సహా 13 నిండు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం” అని ఖతార్ మంత్రి సాద్ అల్-కాబీ మీడియాతో అన్నారు. ఈ ఘటనలో మరో 66 మంది గాయపడ్డారని తెలిపారు. ఇరాన్ దాడులతో మార్చి నుంచి నిలిచిపోయిన రాస్ లఫాన్‌లో కార్యాకలాపాలు కార్మికులు ప్రారంభించేందుకు సిద్ధమవుతోన్న సమయంలో పేలుడు చోటుచేసుకుందని చెప్పారు.అయితే, ఈ ఘటనలో ఎంతమంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారనే వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. గాయపడిన 66 మందికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని ఆయన అన్నారు. ఆదివారం సాయంత్రం బార్జాన్ స్థానిక గ్యాస్ సరఫరా కేంద్రంలో ఒక ‘సాంకేతిక ప్రమాదం’ జరిగిందని అధికారులు తెలిపారు. ప్రమాదం కారణంగా ప్లాంట్ ఎగుమతి సామర్థ్యాలపై ఎలాంటి ప్రభావం పడలేదని, పర్యావరణానికి కూడా ఎటువంటి ప్రమాదం లేదని ఖతార్ ఇంధన మంత్రిత్వ శాఖ పేర్కొంది. ”ఇది ప్రపంచానికి మన ఎగుమతులపై ఏ విధంగానూ ప్రభావం చూపదు..ఇది ఒక ప్రమాదం మాత్రమే, విధ్వంసం లేదా శత్రువులు చేసిన దాడి కాదు” అని ఆయన వివరించారు.
ప్లాంట్ లోపల పేలుడు ఎక్కడ జరిగిందనే వివరాలను ఖతార్ ఇంధన శాఖ బయటపెట్టలేదు. పేలుడు వల్ల జరిగిన నష్టం పరిధిని కూడా వెల్లడించలేదు. అయితే, ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు అల్-కాబీ తెలిపారు. బార్జాన్ ప్లాంట్ రోజుకు దాదాపు 1.4 బిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ అడుగుల గ్యాస్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇక్కడ వెలికితీసిన గ్యాస్‌ను ఖతార్ ప్రధానంగా స్థానిక విద్యుత్ ఉత్పత్తికి, అరేబియా ద్వీపకల్పంలోని ఎడారి ప్రాంతాలలో ఉన్న తన కీలకమైన నీటి శుద్ధి కర్మాగారాలకు ఉపయోగిస్తుంది.అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని అగ్రరాజ్యం సైనిక స్థావరాలతో పాటు చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాలపై ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది. ఈ సమయంలో రాస్ లఫాన్ మార్చిలో ఇరాన్ క్షిపణి దాడులకు గురయ్యింది. ప్లాంట్ ధ్వంసమై.. భారీ నష్టం వాటిల్లి ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడంతో ఉత్పత్తి పునఃప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా.. ప్రమాదం చోటుచేసుకుంది.















