ఈతరం భారతం హైద్రాబాద్ జులై 1:
రాష్ట్ర ఆదాయ సమీకరణపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. బడ్జెట్‌కు అనుగుణంగా లక్ష్యాలు సాధించాలంటే ఆదాయం పెరగాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హెచ్ఎండీఏ, టీజీఐఐసీ ఆదాయ సమీకరణపై దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌శాఖ, మైనింగ్శాఖల్లో లీకులు లేకుండా చూడాలని సూచించారు. ఆదాయ సమీకరణ కోసం చేజింగ్ సెల్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏఐతో లబ్ధిదారుల జాబితాను డీబీటీకి అనుసంధానం చేయాలని సూచించారు.
ప్రాజెక్టుల భూసేకరణకు తొలి ప్రాధాన్యత
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేలా బడ్జెట్‌ను తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రాజెక్టుల భూసేకరణకు మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. బడ్జెట్ ఊహజనితంగా కాకుండా వాస్తవికంగా రూపొందించుకోవాలన్నారు. వివిధశాఖలకు అవసరమైన అన్ని రకాల సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఆదాయం పెంపు, నిధుల సమీకరణ విషయంలో నిర్లక్ష్యం వీడాల్సిందేనని ఆదేశించారు. ఈ సమీక్షలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పాల్గొన్నారు.















