ఈతరం భారతం హైద్రాబాద్ జులై 13:
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల సంస్థలో సీట్లు మెరిట్ ప్రకారమే కేటాయిస్తున్నామని, సీటు రానివారు ఆఫీస్, స్కూల్ చుట్టూ తిరగవద్దని సంస్థ కార్యదర్శి బడుగు సైదులు విజ్ఞప్తి చేశారు. 2026- 27 విద్యా సంవత్సరానికి మెరిట్ ప్రాతిపదికన ప్రవేశాలు జరుగుతున్నాయని, అర్హత గల వారికే సీట్లు కేటాయిస్తామని ఆయన వివరించారు. మెరిట్ ప్రకారం మొదటి విడత, రెండవ విడత సీట్ల కేటాయింపు జరిగిందన్నారు. 5వ తరగతిలో ,6,7,8 లో తరగతుల్లో బ్యాక్ లాగ్ సీట్లు ఇంకా ఏమైనా ఖాళీలు ఉంటే ఆన్ లైన్ లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి విద్యార్థుల మెరిట్ ఆధారంగా అర్హులైన వారికి సీటు కేటాయించబడుతుందన్నారు. ఇంటర్ కాలేజి లో ఎక్కడైనా సీట్లు ఖాళీ గా ఉంటే ఆ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. సీటు రాని వారు ఆఫీస్ , స్కూల్ చుట్టూ తిరగవద్దని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ ఏడాది గురుకులాల్లో సీట్లకు పోటీ పెరిగిందని, సీటు రానివారు హైదరాబాద్ హెడ్ ఆఫీస్ లో కానీ, RCO ఆఫీస్ లలో కానీ, స్కూలు చుట్టూ తిరిగి సమయం వృధా చేసుకోవద్దు అని ఆయన సూచించారు. సీటు కోసం ఎవ్వరి నుంచి దరఖాస్తులు స్వీకరించబడవని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు సంస్థ కార్యాలయానికి రావద్దని, అడ్మిషన్లకు దరఖాస్తులు తీసుకోబడవని, మధ్యవర్తులను నమ్మవద్దని సూచించారు. ఎవరైనా సీట్లు ఇప్పిస్తామని చెప్పితే వారి మాట నమ్మవద్దని, అలా చెప్పిన వారి వివరాలు ఫోన్ : 040-23120496 ద్వారా తెలియజేయాలని ఆయన కోరారు. సీట్లు ఇప్పిస్తామని తల్లిదండ్రులను, విద్యార్థులను మోసం చేసేవారి పై పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుంటామని సైదులు హెచ్చరించారు.















