ఈతరం భారతం రంగారెడ్డి ఆగస్టు 20 ;
సాధారణంగా పోలీసు వాహనాల కాన్వాయ్‌లో కనిపించే పోలీస్ కమిషనర్.. ఈసారి మాత్రం సామాన్యుడిలా బైక్‌పై రోడ్డెక్కారు. కేబీఆర్ పార్క్ చుట్టూ కొత్తగా అమల్లోకి వచ్చిన వన్‌వే ట్రాఫిక్ విధానం ఎలా పనిచేస్తుందో స్వయంగా తెలుసుకునేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ బైక్‌పై చక్కర్లు కొట్టారు. రోడ్ నంబర్ 45 నుంచి జూబ్లీ చెక్‌పోస్ట్, వెంకటగిరి, కేబీఆర్ పార్క్ ప్రధాన గేటు, ముగ్ధ జంక్షన్, బసవతారకం, అగ్రసేన్ చౌరస్తా, ఫిల్మ్‌నగర్ జంక్షన్ మీదుగా తిరిగి రోడ్ నంబర్ 45 వరకు రెండుసార్లు ప్రయాణిస్తూ ట్రాఫిక్ రాకపోకలను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్నం వేళల్లోనూ మరోసారి పరిస్థితిని సమీక్షించారు. అగ్రసేన్ చౌరస్తా, ఫిల్మ్‌నగర్, జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ ప్రధాన గేటు తదితర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులతో సీపీ మాట్లాడారు. వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ట్రాఫిక్ రాకపోకల సరళిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వన్‌వే అమలైన తొలిరోజు లేన్ల మార్పిడిపై వాహనదారుల్లో కొంత అయోమయం నెలకొన్నప్పటికీ ప్రస్తుతం రాకపోకలు సాఫీగా సాగుతున్నట్లు సిబ్బంది సీపీకి వివరించారు. వాహనదారులకు స్పష్టత కల్పించేందుకు జంక్షన్ల వద్ద సైన్‌బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు తగినంత మంది ట్రాఫిక్ సిబ్బందిని మోహరించినట్లు తెలిపార హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ రూ.1,100 కోట్లతో ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు చేపడుతున్నారు. పనులను వేగవంతం చేసేందుకు పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే ట్రయల్ రన్‌లు నిర్వహించి, గుర్తించిన సమస్యలకు అనుగుణంగా ట్రాఫిక్ మార్పులు చేశారు. ట్రాఫిక్ పరిస్థితిని కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నాలుగు షిఫ్టుల్లో వెయ్యి మందికిపైగా సిబ్బందిని మోహరించడంతో పాటు సీసీ కెమెరాలు, డ్రోన్లు, హై-రైజ్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. వన్‌వే విధానం సుమారు రెండేళ్లపాటు కొనసాగే అవకాశం ఉన్నందున వాహనదారులు ముందుగానే ట్రాఫిక్ అడ్వైజరీలను పరిశీలించి ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. రాంగ్‌సైడ్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరవాసులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించి, సూచనలు పాటించాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.















