ఈతరం భారతం హైదరాబాద్, ఆగస్ట్ 20 :
తెలంగాణలో వ్యాపార విస్తరణకు గణనీయమైన అవకాశాలున్నాయని ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ లైఫ్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ అమిష్ బంకర్ గురువారం నగరంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలో 2027 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టర్మ్ ప్లాన్(రిటైల్ ప్రొటెక్షన్) వ్యాపారంలో 60.7 శాతం వార్షిక వృద్ధి సాధించినట్లు చెప్పారు. ఆయన మాట్లాడుతూ 206 మార్చి 31 నాటికి రాష్ట్రంలో 6,56,032 మందికి కవరేజీ అందించగా, నిర్వహణలోని ఆస్తులు రూ.11,708 కోట్లు, సమ్ అష్యూర్డ్ రూ.1,52,016 కోట్లుగా నమోదైనట్లు చెప్పారు. గత ఏడేళ్లలో తెలంగాణలో రూ.4,060 కోట్ల ప్రయోజనాలను, రూ.1,192 కోట్ల డెత్ క్లెయిమ్‌లను చెల్లించినట్లు తెలిపారు. రాష్ట్రంలో కంపెనీకి 11 సొంత బ్రాంచీలు, 3,934 పార్ట్నర్ బ్రాంచీలు, 3,372 స్పెసిఫైడ్ పర్సన్స్, 6,172 అడ్వైజర్లు ఉన్నారు. 2027 ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమసికంలో 99.3 శాతం క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో సాధించగా, విచారణ అవసరం లేని వ్యక్తిగత క్లెయిమ్‌లను సగటున ఒక రోజులో పరిష్కరించినట్లు తెలిపారు. కస్టమర్ సేవల్లో ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, డిజిటలైజేషన్‌ను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐసీఐసీఐ ప్రూ పార్టనర్ స్టాక్, ఐ.పి.ఆర్.యు ఎడ్జ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఏజెంట్లు, భాగస్వాములకు సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. కంపెనీ పేరును ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ గా మార్చేందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందన్నారు. తెలంగాణలో వ్యాపార విస్తరణకు గణనీయమైన అవకాశాలున్నాయని తెలిపారు. బ్రాంచీల విస్తరణ, అడ్వైజర్ల నియామకం, కస్టమర్ అవగాహన కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో కార్యకలాపాలను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు.















