EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి.. . అసదుద్దీన్ ఓవైసీ

ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 3 గురువారం:

_________________________________________

హైదరాబాద్‌లో నల్లగొండ ఎక్స్ రోడ్ నుండి సంతోష్ నగర్ ఓవైసీ జంక్షన్ వరకు రూ.620 కోట్ల ఖర్చుతో నూతనంగా నిర్మించిన సైదాబాద్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో సంతోష్ నగర్, డిఆర్‌డిఓ మార్గాల్లో ప్రయాణించే పాతబస్తీ ప్రజలకు సుదీర్ఘకాలంగా వేధిస్తున్న తీవ్ర ట్రాఫిక్ కష్టాలు తీరాయని పేర్కొన్నారు.గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు.. రేవంత్ రెడ్డి పూర్తి చేశారు అని చెప్పారు.

ఈ సందర్భంగా అసదుద్దీన్ మాట్లాడుతూ, బిఆర్ఎస్  హయాంలో ఈ ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన చేసినప్పటికీ, పనులు పూర్తి చేయడానికి నిధులు విడుదల చేయలేదని విమర్శించారు. తాము అనేకసార్లు బడ్జెట్ కేటాయించాలని విన్నవించినా పట్టించుకోలేదని, కాంట్రాక్టర్‌ను ఇక్కడ పని ఆపేసి వేరే చోటికి వెళ్లమని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ. 620 కోట్లు కేటాయించి, వేగవంతంగా పనులు పూర్తి చేయించారని సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

గతంలో ఆగిపోయిన జూబ్లీ బస్ స్టేషన్  నుండి ఫలక్‌నూమా వరకు మెట్రో విస్తరణ ప్రాజెక్టుపై స్పందిస్తూ, “రేవంత్ రెడ్డి సీఎం కాకముందే ఫలక్‌నూమా ప్రజలకు ఒక మాట ఇచ్చారు. సీఎం అయ్యాక అసద్ భాయ్, నేను ఇద్దరం కలిసి మెట్రో రైలులో కూర్చుని ఫలక్‌నూమాకు ప్రయాణిస్తామని చెప్పారు. ఆ మాటను ఆయన తప్పకుండా నెరవేరుస్తారు” అని ఓవైసీ ధీమా వ్యక్తం చేశారు.

సభలో ఉన్న కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులకు స్పష్టంగా చెప్తున్నా.. నేను రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీకి కాదు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్ , తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి” అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తన సొంత స్టైల్‌లోనే పాలనను ముందుకు తీసుకెళ్లాలని సూచిస్తూ, అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే ప్రత్యేకంగా నిలబెట్టాలని ఆకాంక్షించారు.

Related News

Select the Topic
Scroll to Top