ఈతరం భారతం తిరుపతి సెప్టెంబర్ 7 సోమవారం
________________________________________
తిరుమల శ్రీవారి భక్తులకు త్వరలో మరింత సౌకర్యవంతమైన, పర్యావరణహిత రవాణా అందుబాటులోకి రానుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు రిలయన్స్ సంస్థ విరాళంగా అందించనున్న 25 ఎలక్ట్రిక్ ధర్మరథ బస్సుల్లో ఇప్పటికే 15 బస్సులు తిరుపతికి చేరుకున్నాయి.రాబోయే వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల నాటికి ఈ బస్సులన్నింటినీ పూర్తిస్థాయిలో భక్తుల సేవలకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు.
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఈ ఏడాది జూన్‌లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో టీటీడీకి రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా అందించనున్నట్లు ప్రకటించారు. బస్సులను అందించడంతో పాటు వాటి నిర్వహణకు అవసరమైన 50 మంది డ్రైవర్లను, ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్‌ను కూడా రిలయన్స్ సంస్థ సమకూర్చనున్నట్లు వెల్లడించారు. తిరుపతి నుంచి తిరుమల వరకు భక్తుల రవాణా అవసరాలకు ఈ బస్సులను వినియోగించనున్నారు.















